కలం, వెబ్ డెస్క్: ఎయిరిండియా (Air India) సంచలన నిర్ణయం తీసుకుంది. పైలట్లకు డోప్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి రోజు పైలట్ విధుల్లోకి వచ్చిన వెంటనే దీన్ని తప్పనిసరి చేయనుంది. ఇటీవల ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో పైలట్‌కు డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఎయిరిండియా యాజమాన్యం.. ఈ మేరకు కొత్త విధానం అమల్లోకి తీసుకురానుంది. ఒకవేళ డ్రగ్ తీసుకున్నట్లు తేలితే సదరు పైలట్‌ను విధుల నుంచి తొలగించే అంశాన్ని కూడా పరిశీలించనునంది. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎయిరిండియా పేర్కొంది.
ఆకాశంలో భయానక ఘటన..
ఆగస్ట్ నాలుగో తేదీన ఫుకెట్-ఢిల్లీ విమాన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఏటీసీ వర్గాల సమాచారం ప్రకారం, ఆ రోజు ఇద్దరు పైలట్లలో ఒకరు ‘పాన్.. పాన్ కాల్’ ఇచ్చినట్లు స్పష్టం చేశాయి. విమానానికి అత్యంత ప్రమాదం ఏర్పడే సమయంలో పైలట్లు ఇచ్చే ‘మే డే’ కాల్ తరువాత ఇదే తీవ్రమైన హెచ్చరికగా పరిగణిస్తుంటారు.
పైలట్ కాల్ చేయడంతో విమానాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న ఏటీసీ కమాండ్ సెంటర్.. అత్యంత జాగ్రత్తగా ఢిల్లీ విమానాశ్రయంలో సేఫ్ ల్యాండ్ చేసింది. విపరీతమైన కుదుపులకు లోను కావడంతో 24 మంది గాయపడ్డారు. 17 సెకండ్లలో ఫ్లైట్ ఒక్కసారిగా 300 అడుగల కిందకు జారిపోయింది. ఫ్లైట్ నడిపిన పైలట్‌కు డ్రగ్ టెస్టులో పాజిటివ్ రావడం ఏవీయేషన్ వర్గాల్లో సంచలనంగా మారింది. దీనిపై డీజీసీఏ సైతం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

