తాలిపేరు జలాశయం నిండినా.. భద్రాద్రి కొత్తగూడెం రైతులకు నీటి గండమే

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలోని తాలిపేరు (Taliperu) జలాశయం నిండుగా కనిపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 73.80 మీటర్ల వద్ద నీరు గరిష్ట స్థాయికి చేరుకుంది. అయినా రైతులకు పూర్తి స్థాయిలో నీటిని అందుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌ ఎగువ ప్రాంతాల నుంచి రావాల్సిన ఇన్‌ఫ్లో క్రమంగా పడిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణం. గతేడాది పోలిస్తే ఈసారి వర్షాలు ఆశాజనకంగా లేకపోవడంతో, ప్రస్తుతం కేవలం 2,200 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారుల అంచనా. పైకి నిండుకుండలా ఉన్నా, పంట చివరి దశకు ఈ నీరు సరిపోతుందా అన్న భయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

శాశ్వత సిబ్బంది ఎక్కడ?

ప్రాజెక్టు నిర్వహణ, అత్యవసర సమయాల్లో గేట్లు ఆపరేట్ చేయడం, కంట్రోల్ రూమ్‌లో ప్రవాహ మార్పులను పర్యవేక్షించడం కీలకమైన అంశాలు. అయితే, ఇంతటి ప్రాధాన్యత ఉన్న తాలిపేరు ప్రాజెక్టులో శాశ్వత సిబ్బంది లేకపోవడం అతిపెద్ద లోపంగా మారింది. ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, గేట్, పంప్ ఆపరేటర్లు లేకుండానే తాత్కాలిక ఏర్పాట్లతో నెట్టుకొస్తున్నారు. ఏ క్షణంలో ఇన్‌ఫ్లో అకస్మాత్తుగా పెరిగినా, లేదా సాంకేతిక లోపం తలెత్తినా డ్యామ్ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. బుధవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు ఈ నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి. శాశ్వత ప్రాతిపదికన నిపుణులను కేటాయించాలని అధికారులు కలెక్టర్‌ను కోరడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

​నీటి పొదుపు లేకపోతే నష్టమే

తాలిపేరు ప్రాజెక్టుపై ఆధారపడి చర్ల పరిసర ప్రాంతాల్లో సుమారు 24 వేల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 30 క్యూసెక్కుల చొప్పున ఆయకట్టుకు సాగునీరు వెళ్తోంది. అయితే, ఇన్ ఫ్లో స్థిరంగా లేని ప్రస్తుత తరుణంలో ఎలాంటి ప్రణాళిక లేకుండా నీటిని వదిలేస్తే, రాబోయే రోజుల్లో ముప్పు తప్పదు. ప్రాజెక్టులో ఉన్న ప్రతి బొట్టునూ పొదుపుగా, వంతులవారీ విధానంలో వినియోగించుకుంటేనే పంట చేతికొస్తుంది. నీటి వృథాను అరికట్టి, ఉన్న నీటిని మైక్రో ప్లానింగ్ ద్వారా చివరి ఆయకట్టు వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారులదే. ​ప్రకృతి సహకరించకపోయినా, ప్రాజెక్టులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించడం, అదే సమయంలో డ్యామ్ నిర్వహణకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని తక్షణమే నియమించడం మీదే రైతుల ఆశలు నెలకొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>