కాంగ్రెస్ నిజ‌మైన సెక్యుల‌ర్ పార్టీ: సీఎం రేవంత్ రెడ్డి

క‌లం, వెబ్‌డెస్క్: దేశంలో కాంగ్రెస్ మాత్ర‌మే నిజ‌మైన సెక్యుల‌ర్ పార్టీ అని, హిందు, ముస్లింలు కాంగ్రెస్‌కు రెండు క‌ళ్ల వంటి వార‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైద‌రాబాద్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన మైనారిటీల ఎక్సెలెన్స్ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని వ‌ర్గాల సంక్షేమం కోసం ప‌ని చేస్తోంద‌ని చెప్పారు. కాంగ్రెస్ మైనార్టీలకు 4 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింద‌ని గుర్తు చేశారు.

ఈ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేసేందుకు కొంద‌రు కుట్ర‌లు చేశార‌ని ఆరోపించారు. మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కొందరు వ్యక్తులు, రాజకీయ పార్టీలు కోర్టుల వరకు వెళ్లారన్నారు.  మోదీ, అమిత్ షాలు సైతం ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేయ‌లేక‌పోయార‌ని చెప్పారు. గతంలో అమిత్​ షా తెలంగాణకు వచ్చినప్పుడు చేవెళ్లలో మాట్లాడుతూ మైనార్టీల రిజర్వేషన్​ తొలగిస్తామని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణలో కాదు దమ్ముంటే గుజరాత్​లో రిజర్వేషన్లు రద్దు చేయాలని అమిత్​ షాకు సవాల్​ విసిరామని చెప్పారు.

ఇక‌ గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వం ఉద్యోగ నియామ‌కాల్లో పూర్తిగా విఫ‌ల‌మైంద‌న్నారు. గ‌తంలో ఓ ఆర్ఎంపీ డాక్ట‌ర్‌ను టీజీపీఎస్సీ స‌భ్యుడిగా నియ‌మించార‌ని ఆరోపించారు. బీఆర్ఎస్ హాయంలో గ్రూప్-1 ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించ‌లేక‌పోయార‌ని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం గ్రూప్​ 1 ప్రశ్నా పత్రాలను పల్లీ, బటానీల్లాగా అమ్ముకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ త‌ర్వాత టీజీపీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేసిన‌ట్లు తెలిపారు. యూపీఎస్సీ త‌ర‌హాలో టీజీపీఎస్సీని బ‌లోపేతం చేశామ‌న్నారు. ఓ రిటైర్డ్ డీజీపీని టీజీపీఎస్సీ చైర్మ‌న్‌గా నియ‌మించిన‌ట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>