కలం, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో విద్వేష పూరిత ప్రసంగాలు, పోస్టులను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన తెలంగాణ హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ రెండో సమావేశం నేడు సచివాలయంలో జరిగింది. తెలంగాణ హేట్ స్పీచ్ బిల్లు (Hate Speech Bill)ను సమీక్షించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేశారు. విద్వేష పూరిత ప్రసంగాలు, రాతలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ కమిటీ మొదటి సమావేశం ఆగస్ట్ మొదటి వారంలో జరిగింది.
ఇందులో ప్రధానంగా విద్వేష ప్రసంగాల ఫిర్యాదులను ఏ విధంగా పరిశీలించాలి, సాక్ష్యాలను ఎలా సేకరించాలి, బాధ్యతను ఎవరిపై, ఎలా నిర్ధారించాలి అనే అంశాల గురించి చర్చించారు. అలాగే నిందితులపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ప్రస్తుత చట్టాలు, వాటి అమలులో ఉన్న లోపాల గురించి కూడా చర్చించారు. ఈ వ్యవహారంలో పోలీసులు, ఇతర అధికారుల ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా ప్రస్తావించారు.
కుల, మత, ప్రాంతీయ, భాషా, వర్గ, ఇతర సామాజిక అంశాలతో కూడిన విద్వేష ప్రసంగాలను నియంత్రించే దిశగా ఈ కమిటీ చర్చలు కొనసాగాయి. మరోవైపు భావప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కమిటీ హేట్ స్పీచ్ బిల్లును (Hate Speech Bill) సమగ్రంగా పరిశీలించి, తగిన సిఫార్సులతో నివేదికను సమర్పించనుంది.
Also Read : కాంగ్రెస్ నిజమైన సెక్యులర్ పార్టీ: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)

