కలం, బాసర: బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (Basara IIIT)లో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి చల్లా సంపత్ అకాల మరణం పట్ల విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. ఎ. గోవర్ధన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీసీతో పాటు విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు బుధవారం సంపత్ చిత్రపటానికి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… సంపత్ చదువులో ప్రతిభావంతుడని, అతడి అకాల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు చిన్నచిన్న సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు విశ్వవిద్యాలయంలోని కౌన్సెలింగ్ కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెంపొందించేందుకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో నిరంతరం మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ తగిన మార్గదర్శనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

