కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో తిరుప్పరంకుండ్రం వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశించినా దీపం ఎందుకు వెలిగించలేదో వివరణ ఇవ్వాలని సీఎం విజయ్ (CM Vijay)కు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ లేఖ రాసి షాక్ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, పోలీసుల సూచనలు, అధికారిక ఉత్తర్వులు అన్నీ నివేదికలో పొందుపరచాలని సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167(బి) ప్రకారం, ముఖ్యమంత్రి నుంచి గవర్నర్ నివేదిక కోరినట్లు లోక్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
వివరణ ఇవ్వక తప్పదా..?
నవంబర్ 20వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశించినట్లుగానే దీపం వెలిగిస్తామని చెప్పిన అధికారులు.. చివరి నిమిషంలో ఎందుకు విరమించుకున్నారో స్పష్టంగా చెప్పాలని గవర్నర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సీఎం విజయ్ ఇప్పటివరకు దీపం వివాదంలో ఎక్కడా బహిరంగ ప్రకటించడం, స్పందించడం కానీ చేయలేదు. ఇప్పుడు ఏకంగా గవర్నర్ నివేదిక ఇవ్వాలని సూచించడంతో సీఎం వివరణ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై ఇప్పటికే మధురై కలెక్టర్ సుప్రీం కోర్టుకు సారీ చెప్పిన విషయం తెలిసిందే. ఆలయ బోర్డు సహకారం లేనందునే దీపతూన్ రాతి స్తంభంపై దీపం వెలిగించలేకపోయినట్లు తెలిపారు.

