కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. ట్విస్టుల నడుమ చివరకు టీవీకే చీఫ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఏఐడీఎంకే (AIADMK)లో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపిక అంశం ఇప్పుడు రాజకీయ పోరుకు దారితీసింది. మాజీ సీఎం కే పళనిస్వామి, సీనియర్ నేత ఎస్ పీ వెలుమణి మధ్య ఆధిపత్య పోరు ముదిరింది. పార్టీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది.
రెండువర్గాలుగా పార్టీ
తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల తర్వాత అన్నాడీఎంకేలో నాయకత్వంపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా శాసనసభ పక్ష నేత ఎవరు? పార్టీ వ్యూహాలను ఎవరు రూపొందించాలి? అనే అంశాలపై విభేదాలు పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో పళనిస్వామి, వేలుమణి వర్గాలు బలప్రదర్శనకు దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పళనిస్వామికి మద్దతుగా 17 మంది
సోమవారం ఉదయం ముందుగా పళనిస్వామికి మద్దతుగా 17 మంది ఎమ్మెల్యేలు ప్రొ-టెం స్పీకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం. శాసనసభాపక్ష నేతగా పళనిస్వామినే కొనసాగించాలని వారు కోరినట్లు తెలుస్తోంది. పార్టీని కష్టకాలంలో నడిపించిన నాయకత్వం ఆయనదేనని, ఎమ్మెల్యేల మెజారిటీ మద్దతు కూడా ఆయనకే ఉందని ఆ వర్గం వాదిస్తున్నట్లు సమాచారం.
మధ్యాహ్నానికే మారిన సీన్
అదే రోజు మధ్యాహ్నం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వేలుమణికి మద్దతుగా సుమారు 30 మంది ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. వారు కూడా ప్రొ-టెం స్పీకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. శాసన కమిటీ చైర్మన్‌గా వేలుమణిని నియమించాలని కోరుతూ అధికారిక లేఖ అందజేశారు. దీంతో అన్నాడీఎంకేలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నాడీఎంకేలో గత కొన్ని సంవత్సరాలుగా అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత పార్టీ నాయకత్వంపై అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ. పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మధ్య జరిగిన ఆధిపత్య పోరు పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ తర్వాత పళనిస్వామి పార్టీపై పూర్తి పట్టు సాధించినప్పటికీ.. ఇప్పుడు మరోసారి అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి.
ఏఐడీఎంకేలో అంతర్గత సంక్షోభం
ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా ఎవరికెంత మద్దతు ఉందనే అంశం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. పళనిస్వామికి 17 మంది ఎమ్మెల్యేలు బహిరంగ మద్దతు ప్రకటించగా.. వేలుమణి వర్గం మాత్రం 30 మంది తమతో ఉన్నారని చెబుతోంది. ఈ సంఖ్యలపై అధికారిక స్పష్టత లేకపోయినా.. పార్టీ అంతర్గత సంక్షోభం మాత్రం బహిర్గతమైనట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. పార్టీ అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పరిస్థితి మరింత ముదిరితే పార్టీ చీలిక దిశగా వెళ్లే అవకాశముందన్న చర్చ కూడా సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు పార్టీ అధిష్ఠానం అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రొటెం స్పీకర్ నిర్ణయం ఏమిటి?
ప్రొటెం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? శాసనసభాపక్ష నేతగా ఎవరికీ గుర్తింపు లభిస్తుంది..? పార్టీ అధిష్ఠానం రాజీ ఫార్ములా తీసుకొస్తుందా..? అనే అంశాలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వచ్చే కొద్ది రోజుల్లో అన్నాడీఎంకేలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

