కలం డెస్క్ : రవాణా శాఖలో ఏజెంట్లు, బ్రోకర్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. సులభంగా పని పూర్తయ్యేందుకు ప్రజలు వారిని ఆశ్రయిస్తున్నారు. రవాణా శాఖ సిబ్బంది సైతం ఆ వ్యవస్థనే ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే చెక్‌పోస్టుల్ని ఎత్తివేసిన ప్రభుత్వం త్వరలో ఏజెంట్లు, బ్రోకర్ వ్యవస్థను కూడా పూర్తిగా తొలగించనున్నట్లు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. పాస్‌పోర్టు ఆఫీసుల తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం ఏఐ (AI) బేస్డ్ కేంద్రాలను వాడనున్నట్లు తెలిపారు. దీంతో ఏజెంట్లు, బ్రోకర్ల ప్రమేయమే ఉండదన్నారు. రవాణా శాఖ సర్వీసుల కోసం వినియోగదారులు ఆర్టీఏ (RTA) ఆఫీసుకు రానవసరం లేకుండా వీలైనంతా ఆన్‌లైన్ ద్వారానే అందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఢిల్లీలో జరిగిన ఒక సమావేశానికి హాజరైన సందర్భంగా మంత్రి పొన్నం పలు వివరాలను వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఆర్‌సీ కార్డుల కోసం సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సారథి (NIC) ఇప్పటికే అమలు చేస్తున్నామని, ఇకపైన వాహనాల రిజిస్ట్రేషన్‌కు కూడా ‘వాహన్’ వ్యవస్థనే అమలు చేస్తామన్నారు.
ట్రాఫిక్ నియంత్రణలోనూ ఏఐ వినియోగం :
ట్రాఫిక్ నియంత్రణకు ఏపీఎన్ఆర్ (APNR) ఆధారిత కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలిపారు. దీంతో వాహనాల ఎన్‌ఫోర్స్ మెంట్, చెకింగ్ శాస్త్రీయంగా జరుగుతుందన్నారు. వాహనదారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించడానికి దోహదపడుతుందన్నారు. ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, సీటు బెల్ట్ ధరించకపోవడం, ట్రిపుల్ డ్రైవింగ్, మొబైల్ డ్రైవింగ్ ఇలాంటివాటిని నివారించవచ్చన్నారు. రిఫ్లెక్టివ్ టేపుల విషయంలో నాణ్యతలేనివాటి స్థానంలో క్వాలిటీ ఉన్నవాటిపై ఫోకస్ పెడతామని, దీనివల్ల రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఇందుకోసం క్యూఆర్ (QR mis) వ్యవస్థను పరిచయం చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మల్టీ యాక్సిల్ బస్సులు, గూడ్సు లారీలు కూడా రావాల్సి వస్తున్నదని, ఇకపైన అదనపు బస్ టెర్మినల్స్ నిర్మిస్తామని, లారీల కోసం శివారు ప్రాంతాల్లో ట్రక్ టెర్మినల్స్, పార్కింగ్ యార్డులను అభివృద్ధి చేస్తామన్నారు పొన్నం (Ponnam Prabhakar).
Read Also: ఆడబిడ్డ ఇష్యూ.. అడకత్తెరలో ఆ ముగ్గురు!
Follow Us On : WhatsApp


