కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టం చేయాలనే డిమాండుతో పోరాటాలు సాగిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకటరాములు అన్నారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 1934లో వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఏర్పడిన తమ సంఘం అనేక ఉద్యమాలు చేసిందన్నారు. ఈ క్రమంలో భూ సంస్కరణలు, అటవీ హక్కుల చట్టం, సీలింగ్ యాక్ట్, ఉపాధి, అసైన్డ్ చట్టాల వంటివి సాధించుకుంచామని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ నెల 20 నుంచి 22 వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహబూబ్ నగర్‌లో సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. బహిరంగ సభకు త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. మాజీ ఎంపీ, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షుడు ఎ.విజయరాఘవన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మనేని వీరభద్రం, జాతీయ కార్యదర్శి బి.వెంకట్, ఎంపీ, జాతీయ సహాయ కార్యదర్శి శివదాసు, కేరళ రాష్ట్ర కార్యదర్శి చంద్రన్, లోకనాథం, ఏపీ కార్యదర్శి అమృతలింగం, తమిళనాడు కార్యదర్శి వృట్ట మధు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ హాజరవుతారని తెలిపారు. సభ జరిగే మూడో రోజు నూతన కమిటీని ఎన్నుకుంటారని వివరించారు.
కేంద్రం రూ.10 లక్షలు ఇవ్వాలి..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలతో పాటు కేంద్రం రూ.10 లక్షలు ఇవ్వాలని ఆర్.వెంకటరాములు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 22 లక్షల కుటుంబాలకు తాగునీరు రావడం లేదన్నారు. ఆరున్నర లక్షల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేదన్నారు. కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని విచ్ఛిన్నం చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం కోశాధికారి ఏ. రాములు, ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు కిల్లె గోపాల్, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ పద్మ, వ్యకాస జిల్లా కార్యదర్శి కడియాల మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

