కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (Karimnagar CP Gaush Alam) ఆదేశించారు. గురువారం కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో సీపీ అధ్యక్షతన కమిషనరేట్ అధికారులతో సుదీర్ఘ వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌వోలు, విభాగాధిపతులు పాల్గొని తమ పరిధిలోని కేసుల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, మరియు తీవ్రమైన నేరాల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. నేరస్థులకు త్వరితగతిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి, పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏసీపీలు శ్రీనివాస్ జి, విజయకుమార్, వెంకటస్వామి, యాదగిరిస్వామి, మాధవి, వేణుగోపాల్, వాసాల సతీష్, ప్రతాప్ లతోపాటు కమిషనరేట్‌కు చెందిన పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

