కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడలు (Asian Games 2026) పురుషుల హాకీ పోటీల్లో భారత జట్టు (India Hockey Team) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-0 తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో అక్టోబర్ 1న జరగనున్న సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ నిర్ణీత సమయం కంటే అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి క్వార్టర్లో భారత ఆటగాడు అభిషేక్ మూడో నిమిషంలోనే గోల్ కొట్టి జట్టుకు శుభారంభం అందించాడు.
ఆ తర్వాత బంగ్లాదేశ్ లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత గోల్‌కీపర్ సురాజ్ కర్కేరా అద్భుతంగా అడ్డుకున్నాడు. సురాజ్‌కు ఇది 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. రెండో క్వార్టర్లో భారత్ (India Hockey Team) మరింత దూకుడు పెంచింది. జుగ్రాజ్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా మరొక గోల్ సాధించాడు. దీంతో ప్రథమార్ధం ముగిసేసరికి భారత్ 3-0 ఆధిక్యంలో నిలిచింది.
మూడో క్వార్టర్లోనూ భారత్ ఆధిక్యం కొనసాగింది. సుఖ్జీత్ సింగ్ ఒక గోల్ చేయగా, లక్రా వెంటవెంటనే రెండు గోల్స్ సాధించాడు. ఇదే క్వార్టర్లో హర్మన్‌ప్రీత్ సింగ్ వరుసగా గోల్స్ కొట్టి తన హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. ఆఖరి క్వార్టర్లో సంజయ్, మన్దీప్ సింగ్ చెరో గోల్ చేయడంతో భారత్ 10-0తో ఘనవిజయాన్ని అందుకని మ్యాచ్‌ను ముగించింది.

