కలం, కరీంనగర్ బ్యూరో: బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) సవాల్ విసిరారు. 1000 రోజుల ప్రజాపాలన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకే..
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ లో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. 1000 రోజులుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ యాస భాషతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీని ఏక వచనంతో సంబోధించడం కేటీఆర్, హరీష్ రావుల అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.
అప్పులకు వడ్డీలు కడుతున్నాం..
పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్తు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతోపాటు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళను నిర్మిస్తున్నామని వివరించారు.
50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం..
గత ప్రభుత్వ కాలంలో పేపర్ లీకేజీలు, నోటిఫికేషన్లకే పరిమితమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని మంత్రి తెలిపారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులతో పాటు ధర్మపురి దేవుడికి సైతం శఠగోపం పెట్టారనిఎద్దేవా చేశారు. ప్రజా ప్రభుత్వంలో బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు వేములవాడ, కొండగట్టు పుణ్యక్షేత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నరని గుర్తు చేశారు.
కొప్పులకు 1000 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్..
2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ధర్మపురి ప్రజలు తనకు పట్టం కట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధర్మపురి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఏనాడు ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గ 1000 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి పంపిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.
తాను పంపిస్తున్న ప్రోగ్రెస్ రిపోర్టులో ఎలాంటి తప్పులు ఉన్నా.. దేనికైనా సిద్ధమేనని మంత్రి అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎల్లంపల్లి భూ నిర్వాసితుల పక్షాన నిలిచి రూ. 17 కోట్లు ప్రభుత్వం ద్వారా విడుదల చేయించానని అన్నారు. ధర్మపురిలో డిగ్రీ కళాశాల అనుమతి తీసుకురావడంతోపాటు కళాశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభమై విద్యార్థులకు డిగ్రీ కళాశాల అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
ధర్మారం మండలంలో ఐటీఐ ఏర్పాటు చేస్తున్నామని.. రూ. 10 కోట్లతో ధర్మపురి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. ధర్మపురిలో గోదావరి నది కలుషితం కాకుండా రూ. 17 కోట్లతో సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మధ్యలోనే నిలిచిపోయిన రోళ్ళ వాగు ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని, అక్కపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేసి నియోజకవర్గంలోని రైతులకు సాగునీటిని అందిస్తామని తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ పనులు ప్రారంభించి ధర్మపురి నియోజకవర్గంలోని రైతులకు శాశ్వత సాగునీటి పరిష్కారం సూచిస్తామని మంత్రి తెలిపారు. గొల్లపల్లి మండలంలోని రంగధాముని పల్లి చెరువు పూడికతీత పనులు చేయడంతో పాటు యశ్వంతరావుపేట చెరువును అభివృద్ధి చేస్తామని అన్నారు.
ధర్మపురిలో నైట్ కళాశాల ప్రారంభించడంతో పాటు నేరెళ్లలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో వివిధ నిధుల ద్వారా రూ. 141 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ధర్మపురిలో ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ధర్మపురిలో శాశ్వత తాగునీటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా అమృత పథకం ద్వారా రెండు నూతన నీళ్ల ట్యాంకులను నిర్మించినట్లు వివరించారు. ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రెవెన్యూ డివిజన్ సాధించడంతో పాటు బస్ డిపో ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.
కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు సంక్షేమ శాఖను పట్టించుకోలేదని మంత్రి లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లించడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొప్పుల మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని 411 కుల సంఘాల భవనాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. తాను ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ధర్మపురి నియోజకవర్గంలో పనిచేస్తున్న పోలీసు అధికారుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాజీ మంత్రి కొప్పుల మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వందలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని తనపై సైతం 17 కేసులు నమోదు చేయడంతో పాటు పలు సందర్భాల్లో గతంలో పని చేసిన పోలీసులు మ్యాన్ హ్యాండిలింగ్ చేశారని గుర్తు చేశారు. కొప్పుల ఈశ్వర్ పోలీసులను బెదిరించే ఆలోచన మానుకోవాలని అన్నారు.
రెండేళ్లుగా ధర్మపురి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులపై ఒక్క అక్రమ కేసు నమోదు కాలేదని మంత్రి వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని రానున్న రోజుల్లో రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, బుగ్గారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సాగౌడ్, వెల్గటూర్ మండల పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, పెగడపల్లి మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంట సుధాకర్, నాయకులు వేముల రాజుతో పాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

