కలం, ఉట్నూర్: కన్నకూతురు ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో తండ్రే ఆమెను హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ (Narnoor) మండలం ఉమ్రి గ్రామంలో కలకలం రేపింది. మేనత్త కుమారుడిని ప్రేమించిందన్న కోపంతో యువతిని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసి, అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా బంధువులకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశాడు. పోలీసుల విచారణలో తండ్రి చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది.
ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే, నార్నూర్ సీఐ గురుస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్రి గ్రామానికి చెందిన ఆడే కైలాష్, సుమన్బాయి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో 19 ఏళ్ల కల్యాణికి ఈ నెల 25న నిశ్చితార్థం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ఈ నెల 23న తాను మేనత్త కుమారుడిని ప్రేమిస్తున్నట్లు కల్యాణి తల్లిదండ్రులకు చెప్పడంతో కుటుంబంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కైలాష్ ఈ నెల 24న కుమార్తెను దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలిపారు.
అనంతరం కుమార్తె మెడకు చున్నీ బిగించుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేశాడు. సంప్రదాయం ప్రకారం పెళ్లికాని యువతి మృతదేహాన్ని ఖననం చేయాలి కానీ ఆ ఆచారాన్ని కూడా పక్కనపెట్టి మృతదేహాన్ని రహస్యంగా దహనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామస్థుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో కైలాష్ తన కుమార్తెను హత్య చేసినట్లు అంగీకరించాడని ఏఎస్పీ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి రిమాండ్ కు తరలించినట్టు వెల్లడించారు. రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

