కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి (Darveshpuram Yellamma Temple) దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని చెప్పారు. గురువారం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. పర్యాటక, రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
పర్యాటక శాఖ నిధులు రూ.15 కోట్లతో దేవాలయం వద్ద నిర్మించనున్న విశ్రాంతి గృహం, హరిత హోటల్, ఆలయ సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రానున్న ఏడాది కాలంలో ఆలయ రూపురేఖలను పూర్తిగా మారుస్తామని, త్వరలోనే దేవాలయ అభివృద్ధికి మరో రూ.25 కోట్లు మంజూరు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఆయన ప్రారంభించారు.
రహదారి సౌకర్యం మెరుగుపడితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా నల్గొండ బైపాస్ నుంచి సాగర్ రోడ్డు వయా మంచినీళ్లబావి, ధర్వేశిపురం, చర్లగౌరారం వరకు 10 కిలోమీటర్ల మేర రూ.37 కోట్లతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు, మహబూబ్నగర్-నల్గొండ రోడ్డు మైలసముద్రం వరకు 5 కిలోమీటర్ల మేర రూ.21 కోట్లతో చేపట్టే రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.
ఇప్పటికే ధర్వేశిపురం చుట్టుపక్కల రోడ్ల అభివృద్ధికి రూ.130 కోట్లు మంజూరు చేశామని, గతంలోనూ రోడ్డు వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్, గ్రామ రహదారుల కోసం రూ.67 కోట్లు, నల్గొండ-ధర్వేశిపురం రోడ్డుకు రూ.50 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు అందిస్తోందని మంత్రి తెలిపారు. గురువారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభమవుతోందని చెప్పారు.
ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్రంలో కోటి మందికి పైగా బీమా కల్పిస్తున్నామని, అర్హులందరూ ఇందులో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, ఆలయ చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచ్ రావుల శేఖర్, ఆర్ అండ్ బి ఈఈ శ్రీధర్ రెడ్డి, డీఈఈ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

