కలం, ఆదిలాబాద్: ఎల్నినో ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనా ప్రక్రియను వేగవంతం చేయాలని, నమోదు సమయంలో కౌలు రైతులను సైతం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల వైవిధ్యీకరణ, రైతు రిజిస్ట్రీ, పంట నష్టం అంచనా నమోదు పురోగతిపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించి మాట్లాడారు. వ్యవసాయ విస్తరణ అధికారుల వారీగా జరుగుతున్న పంట నష్టం అంచనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలన జరిపి, వీలైనంత త్వరగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రత్యామ్నాయ పంటలతోనే ఆదాయం రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ఆర్థికంగా బలోపేతం కావాలంటే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని కలెక్టర్ (Rajarshi Shah) సూచించారు. జిల్లాలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరల సాగుతో పాటు పట్టు పరిశ్రమ (సెరికల్చర్), నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. తద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీబీ-జీ రామ్-జీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో వీబీ-జీ రామ్-జీ పథకాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ పథకాల ద్వారా నీటి సంరక్షణ, భూసార అభివృద్ధి, ఉద్యాన తోటల ఏర్పాటు, పంటల వైవిధ్యీకరణ వంటి పనులను చేపట్టి రైతులకు ఉపాధితో పాటు స్థిరమైన ఆదాయం కల్పించాలన్నారు. మండల స్థాయిలో పక్కా ప్రణాళికలు రూపొందించి, అర్హులైన రైతులందరికీ వీటి ప్రయోజనాలు అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి, ఉద్యానవన శాఖ అధికారి గుడిమల్ల సందీప్ కుమార్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, ఉద్యానవన అధికారులు, హెచ్ఈఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.

