కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ విమానాశ్రయ (Adilabad Airport) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిశాన్‌ఘాట్ గ్రామంలో 428.16 ఎకరాల భూమి సేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించారు. నిశాన్‌ఘాట్ గ్రామంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన నోటీసులు జారీ చేసిన వారం రోజుల అనంతరం గ్రామసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాతాదారు పేరు, భూమి విస్తీర్ణం తదితర వివరాల్లో ఏవైనా తేడాలు లేదా వ్యత్యాసాలు ఉంటే సంబంధిత భూ యజమానులు భూసేకరణ అధికారికి లేదా కలెక్టర్ కార్యాలయానికి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణంలో భాగంగా గతంలో టాక్లి, కచికంటి, అర్లీ (బి) గ్రామాల్లో భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే సేకరించిన భూమికి అదనంగా, భవిష్యత్ విస్తరణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2,009 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విమానాశ్రయ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని, అందుకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు.

