కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్ (Kheemya Naik) తెలిపారు. ఖిల్లా ఘనపూర్ మండలం పర్వతపురం (Parvathapuram) రైతువేదికలో గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, జల సంరక్షణ, వర్షాకాల ముందస్తు చర్యలు, రోడ్డు భద్రత, బాల్యవివాహాల నివారణ, వన మహోత్సవం, పాఠశాల మౌలిక సదుపాయాలపై అధికారుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అవసరమైన సౌకర్యాలు ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి చదివించాలని సూచించారు. బాలికలకు బాల్యవివాహాలు చేయకుండా ఉన్నత విద్యను అందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.
ఇంకుడు గుంతల ఏర్పాటు ద్వారా భూగర్భ జలాలు పెరిగి మంచినీటి సమస్యలు తగ్గుతాయని ఆయన వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తోందని, ప్రజలు ఈ ప్రక్రియలో సహకరించాలని సూచించారు. అలాగే అర్హత ఉన్న కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా రూ.20 వేల లబ్ధి పొందవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చేతుల మీదుగా ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ రఘునాథ్, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ స్థాయి సిబ్బంది, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

