కలం, మహబూబ్ నగర్ బ్యూరో : భూసరిహద్దుల స్పష్టమైన గుర్తింపునకు రీసర్వే దోహదం చేస్తుందని అదనపు కలెక్టర్ హరిప్రియ (Additional Collector Haripriya) అన్నారు. మంగళవారం హన్వాడ మండలం చీకర్లపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే (Land Resurvey) పనులను రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివానితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్, హన్వాడ తహశీల్దార్ పాల్గొన్నారు. రీసర్వే పనుల పురోగతిని పరిశీలించిన అదనపు కలెక్టర్ గ్రామస్థులతో మాట్లాడారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. భూముల కొలతలను కచ్చితంగా చేపట్టి, సరిహద్దులను స్పష్టంగా గుర్తించేందుకు ఆధునిక రోవర్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. రీసర్వే పూర్తయిన అనంతరం సంబంధిత భూ యజమానులకు ల్యాండ్ పార్సెల్ మ్యాప్స్ (LPMs) అందజేస్తామని తెలిపారు. వీటి ద్వారా భూముల సరిహద్దులపై స్పష్టత ఏర్పడటంతో పాటు భవిష్యత్తులో భూ సరిహద్దులు, రెవెన్యూ రికార్డులకు సంబంధించిన వివాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. రీసర్వే కార్యక్రమాన్ని సజావుగా, సమర్థంగా పూర్తి చేసేందుకు గ్రామస్థులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని అదనపు కలెక్టర్ హరిప్రియ విజ్ఞప్తి చేశారు.

