కలం, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి (Tanikella Bharani) ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎయిర్‌పోర్టులో భరణి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మోదీతో దిగిన ఫోటోను నేడు ఎక్స్ వేదికగా పంచుకన్నారు. ఆ ఫోటోకు “నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఆదిశంకరుల్ని, వివేకానందుణ్ణి చూడలేదు.. కానీ వారందరి అంశలతో ఉన్న మోదీ గారిని చూశాను, ముట్టుకున్నాను, ఆయన చేతిని ముద్దెట్టుకున్నాను.. నా జన్మ ధన్యమైంది” అంటూ ఆయన క్యాప్షన్ రాసుకొచ్చారు. మోదీని దైవాంశ సంభూతుడిగా అభివర్ణిస్తూ భరణి చేసిన ఈ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.
తనికెళ్ల భరణి చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక దేశ ప్రధానిని దేవుడితో పోల్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, పాలనా పరమైన లోపాలను చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఒక మేధావిగా , రచయితగా పేరున్న భరణి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

