కలం, నిజామాబాద్ బ్యూరో : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ES) మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు (ACB Raids Nizamabad) నిర్వహించారు. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు రెండు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్‌లోని ప్రగతి నగర్లో ఉన్న మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కార్యాలయంలోనూ ఒకేసారి సోదాలు ప్రారంభమయ్యాయి.
నగరం పరిధిలోనే కాకుండా హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఇల్లే లక్ష్యంగా జరిగిన ఈ మెరుపు దాడులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

