కలం, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో ఏసీబీ (ACB) దాడులు కొనసాగుతున్నప్పటికి కొంతమంది ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరో పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో ఇన్స్పెక్టర్ మహేందర్ (Bathula Mahendar) ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే , సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫ్రాడ్ కేసులో బాధితుడి పేరు, అతని కుటుంబసభ్యుల పేర్లను నమోదు చేయకుండా ఉండేందుకు ఇన్స్పెక్టర్ మహేందర్ రూ. 9 లక్షల లంచం డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు రూ. 5 లక్షలు చెల్లించాడు. మిగితా రూ.4 లక్షలు కూడా చెల్లించాలని ఇన్స్పెక్టర్ ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శనివారం నాంపల్లి సైబర్ క్రైమ్ కార్యాలయం, ఇన్స్పెక్టర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా రూ. 13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, కీలక డాక్యుమెంట్లను ఏసీబీ (ACB) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇన్స్పెక్టర్ మహేందర్ పై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇన్స్పెక్టర్ మహేందర్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయని, సోదల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Read Also: ఆటో డ్రైవర్‌గా మారిన ఐటీ ఉద్యోగిని.. వీడియో వైరల్!
Follow Us On: Instagram

