కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల సర్వేయర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు. ఈ వ్యవహారంలో అతడికి సహకరించిన ఇద్దరు ప్రైవేట్ సహాయకులను సైతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సైదాపూర్ మండలం అమ్మన్‌గుర్తికి చెందిన ఓ వ్యక్తి భూమికి సర్వే నిర్వహించేందుకు మండల సర్వేయర్ యెక్కలదేవి కుమారస్వామి రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా మే 23న యూపీఐ ద్వారా రూ.5 వేలు, జూన్ 2న తన ప్రైవేట్ సహాయకుడు వంగా విహిత్ రెడ్డి ద్వారా మరో రూ.10 వేలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన రూ.10 వేల కోసం శుక్రవారం ఫిర్యాదుదారుడిని సంప్రదించగా, ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. సర్వేయర్ సూచన మేరకు ప్రైవేట్ సహాయకుడు తీగల రాజేష్ లంచం స్వీకరిస్తుండగా పట్టుకుని, అతని వద్ద నుంచి రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సర్వేయర్ అరెస్ట్
విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిన పనికి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసి స్వీకరించినట్లు నిర్ధారణ కావడంతో సర్వేయర్ కుమారస్వామితో పాటు తీగల రాజేష్, వంగా విహిత్ రెడ్డిలను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం వారిని కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

