కలం, వరంగల్ బ్యూరో : సాధారణంగా ఓ గ్రామానికి ఒకే మండలం, ఒకే జిల్లా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒకటే ఊరు. కానీ.. మూడు జిల్లాల పరిధి ఉన్నాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు పనిని బట్టి ఒక్కో జిల్లాకు వెళ్లాల్సి వస్తోంది. పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు, పోలీస్ వివాదాలు, రెవెన్యూ పరమైన పనుల కోసం మూడు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. అదే హనుమకొండ జిల్లా నడికూడ మండలం వెంకటేశ్వర్లపల్లి (Venkateshwarlapally).
అయితే ఇది ఊరంత ఒకే మండలం, ఒకే జిల్లా పరిధిలో ఉందని అందరూ అనుకుంటారు. మూడు వేల జనాభా గల ఈ గ్రామంలో 1,370 ఓటర్లు ఉన్నప్పటికి జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా ఆ గ్రామాన్ని అప్పటి ప్రభుత్వం రెవెన్యూ గ్రామంగా ప్రకటించలేదు. దీంతో ఆ గ్రామం ఇప్పుడు కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ(HanamKonda) జిల్లాల పరిధిలోకి వెళ్లింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న అప్పటి కమలాపూర్.. అంటే ప్రస్తుతం హనుమకొండ జిల్లా మండలంలోని వెంకటేశ్వర్లపల్లి (Venkateshwarlapally) ని నడికూడ మండల పరిధిలోకి మార్చారు. దీంతో ఆ గ్రామం మూడు జిల్లాల సరిహద్దులో ఉండటం వల్ల ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం మానేశారు.
రైతులు పట్టాదారు పాసు పుస్తకాల కోసం నడికూడ (Nadikuda)లో దరఖాస్తు చేసుకుంటే ధ్రువపత్రాలన్నీ నార్లాపూర్ గ్రామం పేరిట జారీ అవుతున్నాయని చెబుతున్నారు. దీంతో ఒక్కొక్క పనికి ఒక్కొక్క చోటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ గ్రామాన్ని గెజిట్ లో కమలాపూర్ మండలం నుంచి మార్చక పోవడంతో కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ.. తెరిచేదెన్నడు..?
Follow Us On: Pinterest


