కలం, వెబ్ డెస్క్: సమాన అవకాశాలే కాదు సమాన ఫలితాలు కూడా రాబట్టాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సును ఆమె ప్రారంభించి ప్రసంగించారు. నియామకాల్లో నిజాయితీ, నైతికతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ రాజ్యాంగ నిర్మాతలు సర్వీసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కేటాయించడం ద్వారా, కేంద్రం, రాష్ట్ర స్థాయిల్లో పీఎస్సీల పాత్రకు వారు ఇచ్చిన ప్రాధాన్యాన్ని స్పష్టంగా చాటి చెప్పారని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సమానత్వం వంటి మౌలిక విలువలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పని తీరుకు అత్యంత ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పేర్కొన్నారు.
సమాన అవకాశాలు దక్కాలి
ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశ్యంతోనే పీఎస్సీలు ఏర్పాటు చేశారన్నారు. అందరికీ సమాన న్యాయం చేసేలా పీఎస్సీలు వ్యవహరించాలని ఆమె అభిప్రాయపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎంపిక చేసే ఉద్యోగులే పాలనలో “శాశ్వత కార్యనిర్వాహక వ్యవస్థ”గా పనిచేస్తారని పేర్కొన్నారు. ప్రజానుకూల విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే నిజాయితీ, సున్నితత్వం, నైపుణ్యం కలిగిన సివిల్ సర్వీసులే కీలకమని తెలిపారు. పీఎస్సీలు నియమించే అభ్యర్థుల్లో నిజాయితీ మరియు నైతికతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) స్పష్టం చేశారు.
నైపుణ్యాల్లో లోపాలను శిక్షణ
నైపుణ్యాల లోపాన్ని శిక్షణ ద్వారా అధిగమించొచ్చు .. కానీ నైతిక లోపం తీవ్రమైనదని.. దాన్ని అధిగమించలేని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో నైతిక విలువలు లేకపోతే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని హెచ్చరించారు. సివిల్ సర్వీసుల్లో ఉన్న యువత బలహీనవర్గాల కోసం పనిచేయాలని సూచించారు. మహిళల అవసరాలు, ఆకాంక్షల పట్ల సివిల్ సర్వెంట్లు సున్నితత్వం చూపించాలని కోరారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో పీఎస్సీల పాత్ర కీలకమన్నారు.
భారత్ వేగంగా ఎదుగుతోంది
ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోందని, త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా ప్రయాణిస్తున్నదని రాష్ట్రపతి అన్నారు.‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనకు సమర్థవంతమైన పాలనా వ్యవస్థలు అవసరమని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సివిల్ సర్వీసులను రూపొందించడంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.


