కలం వెబ్ డెస్క్ : తిరుమలలో భక్తులు సమర్పించే కానుకల లెక్కింపుల్లో పారదర్శకత(transparency) పాటించాలని ఏపీ హైకోర్టు(AP High Court) వ్యాఖ్యానించింది. తిరుమల(Tirumala) శ్రీవారి పరకామణి చోరీపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. భక్తులు స్వామి వారికి సమర్పించే ప్రతి పైసాకు లెక్క సరిగ్గా ఉండేలా జాగ్రత్త పడాలని అధికారులకు సూచించింది. కానుకల లెక్కింపులో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని పేర్కొంది.
పరకామణి లెక్కింపు విధానాలపై న్యాయస్థానం ఆరా తీసింది. ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతుల్లోనే లెక్కింపు జరుపుతున్నారా, ఆధునిక విధానాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదన్న విషయాపై ప్రశ్నలు వేసింది. లెక్కింపుల్లో టెక్నాలజీని వాడాలని, ఏఐ(AI), కంప్యూటర్లు(Computers), డిజిటల్ రికార్డింగ్స్ (Digital recordings) వినియోగించాలని చెప్పింది. పర్యవేక్షణ, రికార్డుల భద్రతను సాంకేతిక విధానాలతో పొందుపర్చాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి గతంలోనే విచారణకు ఆదేశించినట్లు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే ఒక సమగ్ర ముసాయిదా రూపొందించి, రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని టీటీడీ బోర్డును ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆస్తుల విచారణ వేగవంతంగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పోలీసు అధికారులను ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.


