కలం, వెబ్‌డెస్క్: దేశంలో 5జీ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది నవంబర్ నాటికి 5జీ సాంకేతిక వినియోగిస్తున్నవారి సంఖ్య (5g subscribers) 39.4కోట్లకు చేరిందని ఎరిక్సన్ మొబిలిటీ నివేదికను ఉటంకిస్తూ సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) వెల్లడించింది. ఇది మరికొన్ని రోజుల్లోనే 40కోట్లకు చేరనుందని పేర్కొంది. కాగా, దేశంలో టెలికాం వినియోగదారుల సంఖ్య గతేడాది డిసెంబర్ నాటికే 120కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఖ్యలో ఎలాంటి మార్పూ లేదు. మొత్తం టెలికాం వినియోగదారుల్లో వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ 96కోట్ల మందితో టాప్‌లో ఉంది. వైర్‌లైన్ కనెక్షన్స్ 45కోట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొబైల్ డేటా వాడకం సగటున నెలకు 36 జీబీగా ఉంది. ఇది 2031 నాటికి 65 జీబీకి చేరుతుందని సీవోఏఐ చెప్తోంది. అలాగే గత ఐదేళ్లలో టెలికాం ఉత్పత్తుల ఎగుమతులు 72శాతం పెరిగినట్లు తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.పదివేల కోట్ల విలువైన టెలికాం ఉత్పత్తులను ఎగుమతి చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.18,406 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.


