కలం, కరీంనగర్ బ్యూరో : ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. ఒక్క ఓటుతో ప్రభుత్వాలు మారిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పాటు సర్పంచ్ ఎలక్షన్లలో (Sarpanch Elections) ఒక్క ఓటుతో గెలిచిన వారు చాలానే ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన తెలంగాణ మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఇలానే విజయం సాధించారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ సర్పంచ్ గా గంట రమేష్ భవితవ్యానికి ఒక్క ఓటు వారధిగా నిలిచింది.
సర్పంచ్ ఎన్నికల (Sarpanch Elections) బరిలో రంగాపూర్ గ్రామంలో ముగ్గురు అభ్యర్ధులు బరిలో నిలవగా గంట రమేష్ బ్యాట్ గుర్తుకు 886 ఓట్లు, ప్రత్యర్థి కలబోయిన నరేందర్‌కు 884ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి ఈర్ల భువనతేజకు 5 ఓట్లు పోలవగా, ఒక ఓటు నోటాకు పడింది. 15ఓట్లు చెల్లకుండా పోయాయి. మొదట జరిగిన కౌంటింగ్‌లో రెండు ఓట్లతో గంట రమేష్ గెలుచినట్లు ప్రకటించారు. ప్రత్యర్ధి వర్గం రీ కౌంటింగ్‌కు పట్టుబట్టడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓట్లను మళ్లీ లెక్కించారు. రీ కౌంటింగ్ అనంతరం గంట రమేష్‌కు ఒక ఓటు తగ్గి 885, కలబోయిన నరేందర్‌కు 884 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ తర్వాత ఒక ఓటు తగ్గిపోయి ఒకే ఒక్క ఓటుతో రమేష్ తన ప్రత్యర్థి నరేందర్‌పై విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.


