కలం, వెబ్ డెస్క్ : పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) మూడు పార్టీలకు ఓ పరీక్ష లాగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మద్దతు ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం ఈ ఎన్నికతో మొదట వచ్చింది. అలాగే బీఆర్ ఎస్, బీజేపీకి ప్రజల మద్దతు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కంటోన్మెంట్, జూబీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినా.. వాటిని రెండు నియోజకవర్గాల ప్రజలు ఇచ్చిన తీర్పుగానే అందరూ భావించారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో పాటు 2023లో గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా పంచాయతీ ఫలితాలు (Panchayat Elections) వారి పని తీరుకు ప్రామాణికంగా మారాయి. మంత్రుల నియోజకవర్గాల్లో పట్టు పెరిగిందా లేదా తెలుసుకోడానికి ఈ ఎన్నికలు ఓ పరీక్షలా మారాయి. మూడు విడతల ఎన్నికల పూర్తి కావడంతో తాము బలపరిచిన అభ్యర్ధులు ఎందరు విజయం సాధించారు, ఎందరు ఓడిపోయారు అనే లెక్కలు వేసుకుంటున్నారు. ఫలితాలను విశ్లేషించుకుంటూ ఎవ్వరికి వారు తృప్తి చెందుకుంటూ ప్రజలు తమవెంటే ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.


