కలం డెస్క్: హిందూ ధర్మంలో ఆలయాలను సందర్శించడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొందరు కోరిన కోర్కెలు తీరతాయంటే, మరికొందరు చేసిన పాపాలు తొలగుతాయని నమ్ముతారు. ఏది ఏమైనా ఆ భగవంతుడిని దర్శించుకున్నంత సేపు అన్ని కష్టాలను మరిచి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతామన్నది అనేకమంది భక్తుల విశ్వాసం. అయితే పాపాలను తొలగించడానికి భారతదేశంలో పలు ఆలయాలు ప్రసిద్ధి. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం భారతదేశంలో అత్యంత పురాతనమైన క్షేత్రాలు ఏడు ఉన్నాయి. వాటిని దర్శించుకుంటే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందనే బలమైన విశ్వాసం ఉంది. పురాణాలు, ఇతిహాసాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించబడిన ఈ క్షేత్రాలను సప్త మోక్ష క్షేత్రాలుగా (Sapta Moksha Kshetras) పిలుస్తారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ పవిత్ర నగరాలు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు కేంద్రాలుగా నిలిచాయి.
అయోధ్య
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య శ్రీరామచంద్రుని జన్మభూమిగా ప్రసిద్ధి చెందింది. సరయూ నది ఒడ్డున వెలసిన ఈ నగరాన్ని స్కంధ పురాణం ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొంది. నిత్యం వేలాది భక్తులు రాముని దర్శనార్థం అయోధ్యకు చేరుకుంటుంటారు.
మధుర
అదే రాష్ట్రంలో ఉన్న మధుర, శ్రీకృష్ణుడి జన్మస్థలం. ద్వాపర యుగం నుంచే పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన ఈ నగరం కృష్ణ లీలలకు ప్రసిద్ధి. ముఖ్యంగా జన్మాష్టమి వేడుకలు ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
హరిద్వార్
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ను పురాణాలలో మాయాపురిగా పేర్కొన్నారు. గంగానది పర్వత ప్రాంతాల నుంచి మైదానంలో ప్రవేశించే ప్రధాన ద్వారం ఇదే. గరుడ పురాణం ప్రకారం ఇక్కడ అమృత చుక్క పడినందువల్ల ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది.
కాశీ
కాశీ లేదా వారణాసి సప్త మోక్ష క్షేత్రాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది. వరుణ, అసి నదుల మధ్య ఉన్న ఈ నగరాన్ని శివుడు స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వేశ్వర ఆలయం ఇక్కడ ఉంది. కాశీలో మరణిస్తే నేరుగా మోక్షం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది.
కాంచీపురం
సప్త మోక్ష క్షేత్రాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక నగరం కాంచిపురం. ఇది శక్తి పీఠమైన కామాక్షి అమ్మవారి ఆలయానికి ప్రసిద్ధి. అలాగే పంచభూత లింగాల్లో పృథ్వీ లింగ క్షేత్రంగా కూడా కాంచిపురానికి ప్రత్యేక స్థానం ఉంది.
ఉజ్జయిని
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని (అవంతికా) శైవ, వైష్ణవ సంప్రదాయాలకు కేంద్రంగా నిలిచింది. ఇక్కడ ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అత్యంత ప్రసిద్ధి చెందినది. మహాకాళేశ్వరుని భస్మ హారతిలో పాల్గొంటే జన్మ రాహిత్యం కలుగుతుందనే విశ్వాసం ఉంది.
ద్వారక
గుజరాత్‌లోని ద్వారక, శ్రీకృష్ణుడు మధురను విడిచి నివసించిన రాజధానిగా పురాణాల్లో పేర్కొనబడింది. గోమతి నది తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఆది శంకరాచార్యులు స్థాపించిన పశ్చిమ శారదా పీఠం ఉండడం వల్ల ద్వారకకు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.
హిందూ సంప్రదాయం ప్రకారం, జీవితకాలంలో ఈ సప్త మోక్ష క్షేత్రాలను (Sapta Moksha Kshetras) దర్శించడం వల్ల జన్మబంధం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. దేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకలుగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రాలు ఇప్పటికీ కోట్లాది మందికి విశ్వాసానికి ఆధారంగా ఉన్నాయి.
Read Also: రాహు, కేతు దోషాల నివారణకు సింపుల్ ట్రిక్ !
Follow Us On: Youtube


