కలం, ఖమ్మం బ్యూరో : ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం భూ కబ్జాదారులు, రౌడీలను నగరానికి దూరంగా పెట్టామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswar Rao) తెలిపారు. గురువారం ఖమ్మం నగరం (Khammam City) 14వ డివిజన్ గోపాలపురంలో 2 కోట్ల 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన బీటీ, సీసీ రోడ్లు, డ్రైన్ ల అభివృద్ధి పనులకు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం నగర పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఖమ్మం నగరంలో ప్రజలకు అవసరమైన మౌళిక వసతుల కల్పన కోసం ముఖ్యమంత్రి సంపూర్ణంగా సహకరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పాలనలో అక్రమ కేసులు, భూ కబ్జాలు, మట్కా, గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఉండవని మంత్రి స్పష్టం చేశారు. గంజాయి వల్ల మన బిడ్డలు నాశనం అవుతారని, దౌర్భాగ్యులు సంపాదన కోసం చిన్న పిల్లలకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేసే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నియంత్రించడానికి ప్రజలు సంపూర్ణంగా సహకారం అందించాలని మంత్రి కోరారు.
ఖమ్మం నగర అభివృద్ధికి ప్రభుత్వం 50 కోట్ల నిధులు మంజూరు చేసిందని, జనవరి నెలలో మరో 50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసేలా కృషి చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. నగరంలో చేపట్టే పనులను స్థానిక నాయకులు, అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి నాణ్యతతో, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఖమ్మం నగర జనాభా 5 లక్షలకు చేరిందని, రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా, నూతన డ్రెయిన్లు, రోడ్డు సౌకర్యం, పేదలకు ఇండ్లు వంటి అనేక కార్యక్రమాలను చేయాలని, దీనికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswar Rao) సూచించారు.
డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను వెంట పడి నాణ్యతతో ఎవరు పూర్తి చేయిస్తారో, ప్రజలలో వారికి ప్రాబల్యం పెరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో అటువంటి వారు విజయం సాధిస్తారని మంత్రి తెలిపారు. ప్రజల ఇబ్బందులను అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించే దిశగా నాయకత్వం పని చేయాలని, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయాలని, రాజకీయంగా ఎలాంటి వివక్ష చూపాల్సిన అవసరం లేదని మంత్రి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమంత రావు, కార్పొరేటర్లు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఇర్రిగేషన్ ఇఇ అనన్య, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.
Read Also: సర్పంచ్ సాబ్‌లు.. ఈ ‘గంగదేవిపల్లి’ మోడల్ గురించి మీకు తెలుసా?
Follow Us On: Youtube


