కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామంలో ఘోరం జరిగింది. గత కొంతకాలంగా గ్రామస్తులను హడలెత్తిస్తున్న వీధికుక్కలు .. ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నాయి. కుక్కల గుంపు జరిపిన దాడిలో (Stray Dog Attack) తీవ్రంగా గాయపడిన మారే రాములమ్మ అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాతకొండ గ్రామానికి చెందిన మారే రాములమ్మ సోమవారం ఉదయం పొలం పనులకు బయలుదేరింది. ఈ క్రమంలో గ్రామం దాటుతుండగా ఒక్కసారిగా వీధికుక్కల గుంపు ఆమెపై విరుచుకుపడింది. కుక్కల దాడి (Stray Dog Attack) తీవ్రతకు రాములమ్మ కిందపడిపోగా, అవి ఆమె దుస్తులను పూర్తిగా చింపివేసి, తలను కూడా ఛిద్రం చేశాయి. రాములమ్మ ఆర్తనాదాలు విన్న స్థానికులు, రైతులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కుక్కలను తరిమికొట్టారు.
రక్తపు మడుగులో పడి ఉన్న రాములమ్మ ఒంటిపై దుస్తులు లేకపోవడంతో, స్థానికులు వెంటనే ఒక చీర తీసుకువచ్చి ఆమెకు కప్పారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ప్రథమ చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో బాధితురాలిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకపోయింది. కుక్కల దాడిలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు.
గ్రామంలో గత కొంతకాలంగా వీధికుక్కల సంచారం విపరీతంగా పెరిగిపోయిందని, ఉదయం, సాయంత్రం వేళల్లో పొలాలకు వెళ్లే రైతులు, మహిళలు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, గ్రామంలో తిరుగుతున్న వీధికుక్కలను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: ‘ఉనికి’ పోరు.. ‘GHMC’ ఫైట్.. బీఆర్ఎస్ అస్త్రాలు అవేనా!!
Read Also: ప్యాకేజ్డ్ బేబీ స్కామ్

