సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) పై ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. మీడియా సమావేశానికి టైంకి రాకపోవడంపై అడ్లూరి పై అసహనం వ్యక్తం చేసిన పొన్నం.. ఆయనను ఉద్దేశించి “ఆ దున్నపోతు టైమ్ కి ఎందుకు వస్తాడు” అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక దళిత మంత్రిని పబ్లిక్ గా కించపరిచే వ్యాఖ్యలు చేస్తారా అంటూ దళిత సంఘాలు పొన్నం పై సీరియస్ అవుతున్నాయి. ఇక ఈ వివాదం పై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ పై ఫైర్ అయ్యారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తనని దున్నపోతు అంటూ చేసిన వ్యాఖ్యలు తమ జాతిని మొత్తాన్ని అవమానపరచడమే అని అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. “నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం నా తప్పా పొన్నం ప్రభాకర్ తప్పును ఒప్పుకోని క్షమాపణలు చెప్పాలి. పొన్నం మా జాతిని మొత్తాన్ని అవమానపరిచాడు.. ఆయన లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదు. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను పక్కన ఉంటే మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదు. నేను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. సహచర మంత్రిని అంత మాట అన్నా వివేక్ చూస్తూ ఊరుకున్నాడు. దీనిపై త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షిలను కలుస్తాను” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) స్పష్టం చేశారు.

