కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ (Future City)ని పూర్తిగా రద్దు చేస్తామని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు (Harish Rao) సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ నిర్మాణం కోసం 16 వేల ఎకరాల భూసేకరణ జరిపి, అన్ని రకాల ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సైతం తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు.
సేకరించిన భూమిని ఫార్మాసిటీ (Pharma City) కాకుండా వేరే ఇతర అంశాల కోసం ఉపయోగిస్తే, ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని చట్టం స్పష్టంగా చెబుతోందని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తూ ఆ భూములను ఫ్యూచర్ సిటీ కోసం వాడుతోందని ఆయన మండిపడ్డారు. మొన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో కూడా ఫార్మా సిటీని రద్దు చేయడం లేదంటూ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని ఆరోపించారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూముల్లో ఖచ్చితంగా ఫార్మాసిటీని నిర్మించి తీరుతామని, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ఆయన (Harish Rao) స్పష్టం చేశారు.
Read Also: పొదుపు సంఘాలు కాదు.. ప్రగతి శక్తులు!
Follow Us On : WhatsApp

