కలం, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా బాండీ బీచ్ కాల్పుల ఉదంతం (Bondi Beach) లో హైదరాబాద్ లింకులు బయటపడ్డాయి. నిందితుల్లో ఒకరైన సాజిద్ అక్రం(50) హైదరాబాద్ వాసిగా తేలింది. ఈ మేరకు నిందితుడి వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా అధికారులు భారత్‌కు సమాచారమిచ్చారు. దీంతో భారత భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీనిపై తెలంగాణ డీజీపీ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిందితుడు హైదరాబాదీ అని తెలిపింది. మరింత దర్యాప్తు కోసం నిందితుడి కుటుంబసభ్యులు, సన్నిహితులను విచారిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన సాజిద్ విద్యార్థి వీసాపై 27 ఏళ్ల కింద ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ క్రైస్తవ మహిళను వివాహం చేసుకున్న అనంతరం భారత్‌లోని కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నాడు. అతని కుమారుడు నవీద్ అక్బర్, ఒక కుమార్తె ఉన్నారు. వీళ్లు ఆస్ట్రేలియాలోనే జన్మించడంతో ఆ దేశ పౌరసత్వం ఉంది.
మూడేళ్ల కిందట హైదరాబాద్‌కు..:
ఆస్తి పంపకాల విషయమై సాజిద్ మూడేళ్ల కిందట చివరిసారిగా హైదరాబాద్ వచ్చాడు. అతని తండ్రి సౌదీ అరేబియాలో పనిచేసి వచ్చాక, ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. ఈ ఆస్తి విషయమై సోదరులు, కుటుంబసభ్యులతో సాజిద్‌కు గొడవలు తలెత్తాయి. కాగా, సాజిద్ ఆస్ట్రేలియాలో స్థిరపడిన అనంతరం ఇప్పటివరకు కనీసం మూడు సార్లు భారత్‌కు వచ్చినట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. సాజిద్‌కు ఇద్దరు సోదరులు సహా కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వాళ్లెవరితోనూ అతనికి సత్సంబంధాలు లేవు. ఆఖరికి వృద్ధురాలైన తల్లి అనారోగ్యంతో ఉన్నప్పటికి పట్టించుకోలేదని బంధువులు అంటున్నారు.
మరోవైపు గత నవంబర్‌లో కుమారుడితో కలసి సాజిద్ ఫిలిప్పీన్స్ వెళ్లినట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. సాజిద్.. భారత పాస్‌పోర్టు మీద, అతని కుమారుడు నవీద్ ఆస్ట్రేలియా పాస్‌పోర్ట్ మీద వెళ్లినట్లు తేలింది. ఫిలిప్పీన్స్‌లో 28 రోజులు ఉన్న అనంతరం అక్కడి నుంచి మరో దేశాన్ని గమ్యస్థానంగా చూపుతూ వెళ్లిపోయారు. కాగా, నిందితుడు పలుసార్లు పాకిస్థాన్‌కు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సమన్వయం చేసుకుంటూ భారత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పాస్‌పోర్ట్ అసలుదేనా? సాజిద్ భారత పౌరుడేనా? అతనికి ఉగ్ర లింకులు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ వేగవంతం చేశారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, హైదరాబాద్ పోలీసు అధికారులు కలసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
కాగా, ఈ నెల 14న ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో సాజిద్, అతని కుమారుడు నవీద్ పర్యాటకులపై కాల్పుల (Bondi Beach) కు తెగబడిన విషయం తెలిసిందే. ఈ దురాగతంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 మంది గాయపడ్డారు. సంఘటన స్థలంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో సాజిద్ మృతి చెందాడు. మొదట కోమాలో ఉన్న నవీద్ అక్బర్ అనంతరం ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చాడు.
Read Also: ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Youtube


