కలం, వెబ్ డెస్క్: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ప్రాపర్టీస్ లిమిటెడ్ (IDPL)కు చెందిన సుమారు రూ.4 వేల కోట్ల విలువైన భూములపై అక్రమ కబ్జాలు, దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా సమగ్ర విచారణకు ఆదేశించింది. కూకట్‌పల్లి సర్వేనంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ.. సమగ్ర విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్నది. ఈ భూములు ప్రధానంగా బాలానగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అనుమతులు, మార్పులపై ఆరోపణలు వస్తున్నాయి.
జాగృతి పోరాటంతోనే:
తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) పోరాటాలతోనే ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ జాగృతి విజయమేనని చెప్పారు. ప్రభుత్వం స్పందించి విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కలిపి విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ విచారణలో నిజాలను నిగ్గు తేల్చాలని, తమ కుటుంబం పై రాజకీయ కారణాలతో ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయని ధీమా వ్యక్తం చేశారు.
వివాదం ఇలా మొదలై:
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. ఇటీవల తెలంగాణ జాగృతి పర్యటనలో కవిత కూకట్‌పల్లి ప్రాంతంలోని సమస్యలను ప్రస్తావిస్తూ మాధవరం కృష్ణారావుపై భూముల కబ్జా ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా మాధవరం కృష్ణారావు కవిత భర్తకు ఐడీపీఎల్ భూములతో సంబంధం ఉందని, 36 ఎకరాలు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మాటల యుద్ధం తీవ్రం కావడంతో మాధవరం కృష్ణారావు, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఓ మీడియా ఛానల్‌కు కవిత లీగల్ నోటీసులు కూడా పంపారు.
పరస్పర ఆరోపణలు:
బీఆర్‌ఎస్ హయాంలో కేటీఆర్(KTR) మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ భూములను రెసిడెన్షియల్‌గా మార్చి అనుమతులు ఇచ్చారని కవిత ఆరోపించారు. మాధవరం కృష్ణారావు కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న వెంచర్లలో చెరువు భూములు కబ్జా అయ్యాయని కవిత ఆరోపించారు. అయితే తనపై ఆరోపణలు నిరాధారమని మాధవరం కృష్ణారావు తెలిపారు. ఐడీపీఎల్ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. IDPL భూములు పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించారు. కాగా ఈ భూములను రెసిడెన్షియల్, కమర్షియల్ ఉపయోగాలకు మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Also: మోడీతో ఎంపీల భేటీ లీకులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
Follow Us On: Youtube


