కలం డెస్క్: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన చార్జిషీట్‌ను (Charge Sheet) పరిగణనలోకి తీసుకోలేమని, దాన్ని ఆధారం చేసుకుని ఇద్దరు గాంధీలకు సమన్లు జారీ చేయలేమని ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ (Rouse Avenue) కోర్టు స్పష్టం చేసింది. సమన్లు ఇవ్వడానికి చట్టంలోని నిబంధనలు కూడా అనుమతించవని పేర్కొన్నది. ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే చార్జిషీట్‌ను ఈడీ దాఖలు చేసిందని, ఎఫ్ఐఆర్‌లోని అంశాల ఆధారంగా దర్యాప్తు జరపలేదని కోర్టు స్పెషల్ జడ్జి (Special Judge) విశాల్ గాగ్నే (Vishal Gogne) వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ఎకనమిక్ అఫెన్స్ వింగ్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) కాపీని నిందితులుగా ఉన్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఇవ్వలేమని, కానీ దాన్ని వారు పొందే వెసులుబాటును మాత్రం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ ఎఫ్ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు చార్జిషీట్‌లోని అంశాల ఆధారంగా కోర్టు ఇప్పటికిప్పుడే పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదన్నారు.
మనీ లాండరింగ్ అభియోగాలపై… :
ఈడీ సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే మనీ లాండరింగ్ అభియోగాలన్నీ ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఉన్నట్లు స్పష్టమవుతుందని స్పెషల్ జడ్జి పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్‌లోని అంశాల ఆధారంగా ఈ అభియోగాలు లేవన్నారు. రెండు వైపులా ఆలోచిస్తే ఈ కేసులో మెరిట్స్ కనబడడంలేదన్నారు. అయినప్పటికీ చార్జిషీట్ ఆధారంగా ఈడీ తరఫు న్యాయవాదులు వాదనలను వినిపించవచ్చన్నారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (Additional Solicitor General) ఎస్వీ రాజు వాదిస్తూ, చార్జిషీట్‌లో లేవనెత్తిన అంశాలు, అభియోగాలు అన్నీ సరైననవేనని, దర్యాప్తు ఆధారంగానే రూపొందించామని వివరణ ఇచ్రు. ఏప్రిల్‌లోనే కోర్టుకు దీన్ని సమర్పించినందున దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పెషల్ జడ్జికి రిక్వెస్టు చేశారు.
యంగ్ ఇండియా ద్వారా మనీ లాండరింగ్ :
ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తన వాదనలను వినిపిస్తూ.. నేషనల్ హెరాల్డ పత్రికను నడిపిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే కంపెనీ నష్టాల్లో ఉన్నదని పేర్కొన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి చెందిన యంగ్ ఇండియా (Young India) అనే ఛారిటీ సంస్థ ద్వారా కేవలం రూ. 50 లక్షల రుణం తీసుకుని రూ. 2000 కోట్లతో సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. అక్రమంగా రూ. 988 కోట్లను సమకూర్చుకున్నట్లు ట్రయల్‌లో తేలిందని, ఇది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ (Proceeds of Crime) కిందకే వస్తుందని వివరించారు. యంగ్ ఇండియా ద్వారా మనీ లాండరింగ్ (Money Lanudering) జరిగిందని, ఇది కాగితాల మీద చారిటీ సంస్థగా ఉన్నప్పటికీ అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ (Associated Journals Limited) అనే కంపెనీని సొంతం చేసుకునే ఉద్దేశం స్పష్టమవుతున్నదన్నారు. యంగ్ ఇండియా కంపెనీని ఇందుకోసం ఒక వనరుగా వాడుకున్నారని, ఇలాంటి పద్ధతులతో షేర్ హోల్డర్స్ కు భారీ స్థాయిలో నష్టం జరిగిందన్నారు.
పేపర్‌ను నడిపించాలన్న ఉద్దేశంతోనే.. :
సోనియాగాంధీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఆర్ఎస్ చీమా (RS Cheema) వాదిస్తూ ఈడీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. నష్టాల్లో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థను యంగ్ ఇండియా తీసుకుని నేషనల్ హెరాల్డ్(National Herald Case) పేపర్‌ను తిరిగి పునరుద్ధరించాలనుకున్నదని స్పష్టం చేశారు. పార్టీ ఐడియాలజీ, ఆలోచనలకు అనుగుణంగా ఆ పత్రికను మళ్ళీ నడిపించాలన్నదే యంగ్ ఇండియా ఉద్దేశమన్నారు. అసోసియేటెడ్ జర్నల్స్ అనే కంపెనీని యంగ్ ఇండియా ద్వారా తీసుకున్నా దాని ఆస్తులను యంగ్ ఇండియా కంపెనీకిగానీ, సోనియాగాంధీ లేదా రాహుల్‌గాంధీగానీ తీసుకోలేదన్నారు. ఇలాంటప్పుడ మనీ లాండరింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి కేవలం షేర్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఇద్దరికీ కలిపి 76% షేర్ ఉన్నదన్నారు.
ఈ అభియోగాలన్నీ బోగస్ :
ఈడీ పేర్కొన్నట్లుగా కోల్‌కతాకు చెందిన డాటెక్స్ మర్కండైజ్ (Dotex Marchandise) అనే కంపెనీ షెల్ కంపెనీ కాదని, దాన్నుంచి యంగ్ ఇండియా లోన్ తీసుకున్నదనేది కూడా ఈడీ సృష్టించిన ఒక అభియోగం మాత్రమేనని ఆర్ఎస్ చీమాతో పాటు ఇద్దరు గాంధీల తరపున హాజరైన అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) స్పష్టం చేశారు. ఒకప్పుడు పార్టీ సిద్ధాంతాలను, ఆలోచనలను ప్రతిబింబించిన ఆ పత్రికను తిరిగి నడిపించాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. ఇద్దరు గాంధీలతో పాటు కాంగ్రెస్ ఓవర్సీస్ వ్యవహారాలు చూసే శ్యామ్ పిట్రోడా (Syam Pitroda), సీనియర్ జర్నలిస్టు సుమన్ దూబేలను (Suman Debey) కూడా చార్జిషీట్‌లో ప్రస్తావించిన ఈడీ… వారిపై అభియోగాలను నమోదు చేసింది.
Read Also: ‘ఉపాధి హామీ’ పేరు మార్పుపై భగ్గుమన్న విపక్షం!
Follow Us On: Instagram


