కలం డెస్క్: ఐపీఎల్ వేలం(IPL Auction 2026)లోకి బీసీసీఐ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఇది అభిమానుల్లో కొత్త జోష్ నింపొచ్చని అంతా భావిస్తున్నారు. అదే కొత్త ‘టై–బ్రేకర్’ రూల్. ఒకే ఆటగాడి కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు ఒకే బిడ్‌పై నిలిచిపోయినప్పుడు ఇక గందరగోళానికి చోటుండదు. ఆ టైను బ్రేక్ చేయడానికి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుంది.
కొత్త టై–బ్రేకర్ రూల్ ఇదే…
వేలం(IPL Auction 2026)లో ఒక ఆటగాడి కోసం జట్లు ఒకే మొత్తానికి లాక్ అయినప్పుడు, బీసీసీఐ సంబంధిత ఫ్రాంచైజీలకు ‘టై–బ్రేకర్ ఫామ్’ ఇస్తుంది. ఇందులో జట్లు భారతీయ రూపాయల్లో ఒక ‘రహస్య బిడ్’ మొత్తాన్ని నమోదు చేయాలి. ఈ మొత్తం ఆటగాడికి చెల్లించేది కాదు. ఇది పూర్తిగా బీసీసీఐకి చెల్లించాల్సిన అదనపు మొత్తం కావడం విశేషం.
ఈ రహస్య బిడ్‌లో అత్యధిక మొత్తాన్ని రాసిన జట్టుకే ఆ ఆటగాడు దక్కుతాడు. గెలిచిన జట్టు డిసెంబర్ 16 వేలం తేదీ నుంచి 30 రోజుల లోపు ఆ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు అధికారికంగా ‘టై–బ్రేకర్ బిడ్’గా వ్యవహరించనున్నారు.
ఎందుకు ఈ రూల్ అవసరమైంది?
గతంలో కీరన్ పొలార్డ్ (2010), రవీంద్ర జడేజా (2012) వంటి స్టార్ ఆటగాళ్ల విషయంలో భారీ బిడ్డింగ్ పోరాటాల తర్వాత రహస్య బిడ్ల ద్వారా జట్లు విజయం సాధించాయి. అలాంటి హై–ప్రొఫైల్ టై పరిస్థితులను మరింత స్పష్టంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ఈ కొత్త నియమాన్ని బీసీసీఐ రూపొందించింది.
2026 మినీ వేలంలో గట్టి పోటీ?
ఐపీఎల్ 2026 మినీ వేలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల వద్ద మాత్రమే పర్స్‌లో ఎక్కువ డబ్బు ఉంది. మిగిలిన ఏడు జట్ల పర్స్ బ్యాలెన్స్ దాదాపు సమానంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్, ఇంగ్లాండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ వంటి విదేశీ ఆటగాళ్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశముంది. మరోవైపు ముంబై ఇండియన్స్ వద్ద కేవలం రూ. 2.75 కోట్ల పర్స్ మాత్రమే ఉండటంతో ఈ పోటీలో వారు వెనుకబడే పరిస్థితి కనిపిస్తోంది.
ఆటగాడి ధర మారుతుందా?
ఇక్కడ గమనించాల్సిన కీలక విషయం ఏమిటంటే… టై–బ్రేకర్ ప్రక్రియ వల్ల ఆటగాడి తుది ధరలో ఎలాంటి మార్పు ఉండదు. జట్లు చివరిగా ఏ బిడ్‌పై లాక్ అయ్యాయో అదే మొత్తం ఆటగాడికి చెల్లిస్తారు. రహస్య బిడ్ మొత్తం కేవలం టైను బ్రేక్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ మొత్తం పూర్తిగా బీసీసీఐకి అదనపు ఆదాయంగా చేరుతుంది.
Read Also: స్క్వాష్ ఛాంపియన్స్‌కు రేవంత్ అభినందనలు
Follow Us On: X(Twitter)


