కలం, ఖమ్మం బ్యూరో: అకాల వర్షాల నేపథ్యంలో తడుస్తున్న ధాన్యం, మొక్కజొన్నను ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్ (Chandra Narendra Kumar) డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా జూలూరుపాడులోని సొసైటీ కొనుగోలు కేంద్రం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల వేలాది బస్తాల పంట మురిగిపోతోందని మండిపడ్డారు. రైతులు కష్టపడి పండించిన పంటను కేంద్రాలకు తీసుకొస్తే తేమ శాతం ఎక్కువగా ఉందని, తాలు అధికంగా ఉందని, రంగు మారింది అనే వంకలతో అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అలాగే పంట వివరాలను నమోదు చేసే ‘రైతు యాప్’ నిరంతరం పని చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో సేకరణ జరగకపోవడంతో, అన్నదాతలు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారని ఆయన ఆరోపించారు. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు.
మరో వైపు వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల వద్దే కాపలా కాయాల్సి వస్తోందన్నారు. దీనివల్ల రైతులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి తేమ, రంగు నెపంతో సంబంధం లేకుండా పూర్తి పంటను సేకరించాలని, రైతు యాప్ నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన పంటకు వెంటనే నగదు జమ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి షరతులు లేకుండా పంటను కొనుగోలు చేయకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నరేంద్ర కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా (Bhadradri Kothagudem) సహాయ కార్యదర్శి యాస రోశయ్య, నాయకులు ఎల్లంకి మధు, తూము కోటయ్య, సిరిపురపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Also: బిగ్ ట్విస్ట్.. విజయ్ ప్రభుత్వంలో చేరడం లేదని వామపక్షాల ప్రకటన..!
Follow Us On: WhatsApp

