కలం డెస్క్ : మోడీ నేతృత్వంలోని కేంధ్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని రాష్ట్ర మంత్రి సీతక్క (Seethakka) మండిపడ్డారు. తొలి ప్రధాని నెహ్రూ (Nehru) చరిత్రను చెరిపేసే కుట్రతో మొదలుపెట్టి చివరకు జాతిపితగా కొల్చుకునే మహాత్మా గాంధీని (Mahathma Gandhi) సైతం పల్చన చేస్తున్నదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా పేదల కడుపు నింపే (Poverty మార్గాల్లో ఒకటిగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGS) కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఏండ్ల కింద తీసుకొచ్చిందని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాని స్ఫూర్తిని, ఆత్మను చంపేస్తున్నదన్నారు. ఆ పథకం పేరును మార్చడంతో పాటు అమలు విధానాన్నీ మార్చేస్తున్నదన్నారు. పేదలను, రాష్ట్రాలను శిక్షించే లక్ష్యంతోనే ఆ చట్టాన్ని రీప్లేస్ చేసేలా ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’ (Vikasit Bharat G Ram G) చట్టాన్ని తీసుకురావడాన్ని ఆమె తప్పుపట్టారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆత్మను, స్ఫూర్తిని చెరిపేసే కుట్ర :
గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులోనూ, అమలు విధానంలోనూ మార్పులు చేస్తోందని, ఇది అంతిమంగా పేదల ఉపాధి భరోసాను ఎత్తివేయడమేనని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం ఈ నిర్ణణం తీసుకుంటున్నదని ఆరోపించారు. గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత కల్పిస్తూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళకుండా యూపీఏ ప్రజాకోణం నుంచి ఆలోచించి ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అలాంటి గొప్ప చారిత్రకమైన పథకాన్ని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఇప్పుడు దాని స్థానంలో కొత్త చట్టం కోసం తపిస్తున్నదని మండిపడ్డారు. గాంధీ పేరును తొలగించడం ద్వారా ఆయన ఆలోచనలు, విలువల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక వైఖరి స్పష్టమవుతున్నదన్నారు. మొదటి నుంచీ ఈ పథకం మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే దశలవారీగా బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయన్నారు.
వసూళ్ళు ఎక్కువ.. కేటాయింపులు తక్కువ :
జీఎస్టీ సహా పలు రూపాల్లో రాష్ట్రాన్ని ఆదాయాన్ని కేంద్రం తీసుకుంటున్నదని మంత్రి సీతక్క(Seethakka) గుర్తుచేశారు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చెప్పిన 42% నిధులను కూడా రాష్ట్రాలకు ఇవ్వడంలేదన్నారు. ఇంకోవైపు ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు ఏడాదిలో 100 రోజుల పని కల్పించాలని యూపీఏ ఆలోచిస్తే దాన్ని 42 రోజులకు మోడీ ప్రభుత్వం కుదించిందన్నారు. దీనికి తోడు ఫండింగ్ ఫార్ములాను కూడా మార్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గతంలో 100% కేంద్ర ఫండింగ్‌తో పథకం అమలైందని, ఇప్పుడు ఆ వాటాను 60 శాతానికి కుదించడం సిగ్గుచేటన్నారు. మిగిలిన 40% భారం రాష్ట్రాలపై పడుతుందని, ఇది అన్యాయమైన చర్య అని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌చార్జీల పేరుతో రాష్ట్రాలకు దక్కకుండా నిధులను మింగేస్తున్నదని ఆరోపించారు. ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదన్నారు. రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన న్యాయమైన నిధుల వాటాను కూడా ఇవ్వడంలేదన్నారు.
Read Also: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తా : కవిత
Follow Us On: X(Twitter)


