కలం డెస్క్: టీమిండియా యువ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ(Tilak Varma) మరో రికార్డ్ చేశాడు. కింగ్ కోహ్లీ(Virat Kohli) పేరుపై ఉన్న రికార్డ్‌కు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో లక్ష్య ఛేదనలో అత్యధిక సగటు సాధించిన బ్యాటర్‌గా తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో ఛేజింగ్ సమయంలో కనీసం 500 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో తిలక్ వర్మ 68 సగటుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన తిలక్ వర్మ 543 పరుగులు చేశాడు. ఇదే జాబితాలో విరాట్ కోహ్లీ 48 టీ20ల్లో ఛేజింగ్ చేసి 2013 పరుగులు సాధించగా, ఆయన సగటు 67.1గా ఉంది.
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ (47.71), జేపీ డుమినీ (45.55), కుమార సంగక్కర (44.93) తదితరులు ఉన్నారు. ఈ రికార్డు సాధించిన మ్యాచ్ సౌతాఫ్రికాతో ధర్మశాల వేదికగా ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ(Tilak Varma) 25 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
ఆ రికార్డు కూడా తిలక్ ఖాతాలోనే
టీ20 క్రికెట్లో ఒక జట్టుపై అత్యధిక సగటు సాధించిన బ్యాటర్‌గానూ తిలక్ వర్మ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కనీసం 300 పరుగులు చేసిన బ్యాటర్లలో సౌతాఫ్రికాపై తిలక్ వర్మ 70.50 సగటుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ (70.28), శ్రీలంకపై విరాట్ కోహ్లీ (67.8), వెస్టిండీస్‌పై కేఎల్ రాహుల్ (58.83), వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీ (57) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Read Also: వాళ్లిద్దరూ వరల్డ్ కప్‌లో గెలిపిస్తారు: అభిషేక్
Follow Us On: Sharechat


