హైదరాబాద్ శివార్లలో “ట్రాప్ హౌస్ పార్టీ(Trap House Party)” పేరుతో ఫామ్ హౌసులో మైనర్ల మత్తు పార్టీ కలకలం రేపుతోంది. శనివారం రాత్రి మొయినాబాద్ ప్రాంతంలోని ఓక్స్ ఫామ్ హౌసులో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని అనుమానించిన రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. పార్టీలో 50 మంది మైనర్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వారితో పాటు ఆరుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 9 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పార్టీ నిర్వహణకి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ లో “ట్రాప్ హౌస్. 9MM” యువకుడే ట్రాప్ హౌస్ పార్టీకి(Trap House Party) ప్రధాన సూత్రధారి అని పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడైంది. ముందుగా ఆ పేజీలో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నామని ప్రకటనలు విడుదల చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ పార్టీ ఉంటుందని, మీరు జీవితంలో ఎన్నడూ చూడని ఆనందం పొందుతారని ప్రకటనలలో పేర్కొన్నారు. సింగిల్‌గా వస్తే రూ.1600, జంటగా వస్తే రూ.2800 అంటూ ఎంట్రీ పాస్ ధరలు వెల్లడించారు. దీంతో 50 మంది మైనర్లు మొయినాబాద్ పార్టీకి చేరుకుని, మత్తులో మునిగి తేలుతుండగా ఎస్‌వోటీ అధికారులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి, మైనర్ల కుటుంబాలకు సమాచారం అందించారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.

