Mobile Popup Ad
Mobile Popup Ad

అంగరంగ వైభవంగా శంభులింగేశ్వరుడి జాతర

కలం, నకిరేకల్ బ్యూరో: నల్గొండ (Nalgonda) జిల్లా నకిరేకల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నెల్లిబండ శంభులింగేశ్వర స్వామి (Nellibanda Shambulingeshwara Swamy) జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. కొండపై కొలువైన ఆ పరమశివుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలిరావడంతో నెల్లిబండ గుట్ట జనసంద్రంగా మారింది. ఎటు చూసినా భక్తుల కోలాహలం.. లింగ నామ స్మరణతో కొండ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దగట్టు జాతర తర్వాత అతిపెద్ద జాతరగా ఈ జాతర కొనసాగుతోంది. జాతర ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. కొండపైకి చేరుకునే దారి పొడవునా భక్తులు ఓ లింగా.. ఓ లింగా.. అంటూ చేస్తున్న నినాదాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. భక్తులు తమ కోర్కెలు తీరాలని కోరుకుంటూ స్వామివారికి బోనాలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ముస్తాబైన నెల్లిబండ గుట్ట

జాతర సందర్భంగా ఆలయ కమిటీ, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల కాంతులతో ఆలయ పరిసరాలు ధగధగలాడుతున్నాయి. భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నకిరేకల్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించినప్పటికీ, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో హైవే నుంచి ఆలయానికి వెళ్లే దారుల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. మరోవైపు జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రంగులరాట్నాలు, ఆటవస్తువుల దుకాణాలు పిల్లలను అలరిస్తున్నాయి. కేవలం నకిరేకల్ నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాలైన చిట్యాల, కట్టంగూర్, నార్కెట్‌పల్లి, సూర్యాపేట జిల్లాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.

Read Also: తొమ్మిదేళ్ల తర్వాత పీఎస్ఎల్ విజేతగా పెషావర్ జల్మీ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>