కలం, తెలంగాణ బ్యూరో: తుంగభద్ర (Tungabhadra) జలాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని సిద్ధం చేసింది. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యంగా తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నది. ఈ నేపథ్యంలో జలసౌధలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంజినీర్లు, జలవనరుల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
15.9 టీఎంసీలకు 5 టీఎంసీలే
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) కింద తెలంగాణకు సంవత్సరానికి 15.9 టీఎంసీల నీటి హక్కు ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం 5 నుంచి 6 టీఎంసీలే వినియోగంలోకి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాలువల్లో భారీగా పూడిక పేరుకుపోవడం, నిర్మాణపరమైన లోపాలు, నీటి ప్రవాహానికి అడ్డంకులు ప్రధాన సమస్యలుగా గుర్తించారు.
ఈ కారణంగా ఆశించిన స్థాయిలో నీటి మళ్లింపు సాధ్యం కావడం లేదని ఇంజినీర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే పూడికతీత పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆర్డీఎస్ ఆనకట్ట భద్రతపై కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కెనాల్ ఆధునికీకరణ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.59 కోట్లు డిపాజిట్ చేసినప్పటికీ ప్యాకేజీ-1, 2 పనులు ఇంకా ప్రారంభం కాలేదని, ప్యాకేజీ-3, 4 మాత్రమే పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
వెంటనే పూడికతీత చేపట్టాలి
నిలిచిపోయిన పనులను వెంటనే చేపట్టాలని, ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో గురువారం జరిగే మూడు రాష్ట్రాల సీఎంల సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. పూడిక పేరుకుపోయిన ప్రాంతం కర్నాటక భూభాగంలో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారం అవసరమని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే 2004లో నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను అమలు చేయాలని కేంద్రానికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. తుంగభద్ర జలాల వినియోగంలో మూడు రాష్ట్రాల సమన్వయం అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు.. నిల్వ సామర్థ్యం పెంపు
ఆర్డీఎస్ కింద మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే అంశంపైనా సమీక్షలో చర్చ జరిగింది. దీన్ని 6 టీఎంసీలకు పెంచే అవకాశాలను పరిశీలించాలని, అవసరమైతే భూసేకరణ కూడా చేపట్టాలని సీఎం సూచించారు. తుమ్మిళ్ల ద్వారా నీటి వినియోగాన్ని మరింత సమర్థవంతం చేయాలని కూడా నిర్ణయించారు. కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద సిల్ట్ పేరుకుపోవడం, నది ప్రవాహ మార్గంలో మార్పులు వంటి సమస్యలు ప్రధాన అడ్డంకులుగా గుర్తించారు.
తొలిసారి మీటింగ్‌లో రైతులు
ఆర్డీఎస్ పరిసర ప్రాంతాల రైతులను జలసౌధ సమీక్షకు ప్రభుత్వం ఆహ్వానించింది. రైతులు స్వయంగా సీఎంకు వినతిపత్రాలు అందజేశారు. వారి సమస్యలను విన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రాల మధ్య జల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారుల స్థాయి సమీక్షకు రైతులను ఆహ్వానించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా నిలిచింది.
నేడు కర్నాటక, ఏపీ, తెలంగాణ సీఎంల కీలక సమావేశం
తుంగభద్ర జలాల వినియోగంపై గురువారం కర్ణాటకలోని మునీరాబాద్లో కీలక సమావేశం జరగనుంది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకే వేదికపై పాల్గొని జలాల వాటా, వినియోగంపై చర్చించనున్నారు. ఈ భేటీపై రైతులు, నీటి వినియోగదారుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి.

