కలం, కరీంనగర్ బ్యూరో: వ్యవసాయ భూముల సర్వే కోసం ఆన్‌లైన్‌లో ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతుల పరిస్థితి ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం.. జీతం తీసుకునే సర్వేయర్లకు రైతులు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఎకరానికి కనీసం 10 వేల రూపాయలు ఇస్తేనే కానీ సర్వేయర్లు భూమి మీదకు అడుగు పెట్టడం లేదు. ఒకవేళ రైతులు లంచం ఇవ్వడానికి నిరాకరిస్తే.. టెక్నికల్ సమస్యలు ఉన్నాయని సాకులు చెప్పడం, లేదా భూమి సరిహద్దులను తప్పుగా చూపిస్తామని భయభ్రాంతులకు గురిచేయడం సర్వసాధారణంగా మారింది. ఈ లంచాల దందా కేవలం సర్వేయర్లకే పరిమితం కాలేదు. జిల్లా కేంద్రంలోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం నుంచి ఒరిజినల్ టిప్పన్ తీసుకురావడానికి, కొలతలకు వచ్చినప్పుడు సర్వేయర్లకు, వారి అసిస్టెంట్లకు భోజనాలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల పేరిట అదనపు వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి.
రంగంలోకి ఏసీబీ..
ఇలాంటి అవినీతి అధికారుల ఆట కట్టించేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులు చేస్తూ లంచగొండుల గుట్టు రట్టు చేస్తున్నది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తిలో మూడు ఎకరాల భూమిని సర్వే చేయడానికి రూ.25 వేల లంచం తీసుకుంటూ సర్వేయర్ ఎక్కలదేవి కుమారస్వామి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ మల్లోజు నాగరాజు భూసర్వే కోసం రూ.15 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అలాగే గతంలో సిరిసిల్ల మండల సర్వేయర్ వేణు తన అసిస్టెంట్ ద్వారా 20 వేలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండల సర్వేయర్ బ్రహ్మయ్య రూ.10 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయారు. నిర్మల్ రూరల్ మండల సర్వేయర్ బాలకృష్ణవర్మ 15 వేలు, వనపర్తి జిల్లా కొత్తకోట మండల సర్వేయర్ జి. నవీన్ రెడ్డి ఏకంగా 40 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.
రీ సర్వే అమలుపై సందేహాలు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న భూ రీ సర్వే కార్యక్రమం, క్షేత్రస్థాయిలో నెలకొన్న అవినీతి మధ్య ఎలా అమలవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 2,240 గ్రామాలను ఎంపిక చేసి, 5,520 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించినప్పటికీ, ఇప్పటివరకు వారికి స్పష్టమైన బాధ్యతలు అప్పగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మండల సర్వేయర్ల ఆధిపత్యం, లంచాల ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త సర్వే వ్యవస్థ ఎంతవరకు పారదర్శకంగా సాగుతుందన్న ప్రశ్నలు రైతుల్లో వినిపిస్తున్నాయి.

