కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన నలుగురి దారుణ హత్యల కేసు (Nalgonda Murder Case)లో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. తొలుత గుప్త నిధుల వేటగాళ్ల పనిగానో, లేదా పాత కక్షల వల్ల జరిగిందో అని భావించిన ఈ కేసులో పోలీసుల విచారణతో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. కన్నతల్లిని, తోడబుట్టిన వారిని అత్యంత పాశవికంగా చంపించింది మరెవరో కాదు… ఆ ఇంట్లో పుట్టి పెరిగిన సొంత కూతురు, ఆమెకు తోడైన అల్లుడేనని పోలీసులు నిర్ధారించారు. హసీనాకు ఉన్న ఆస్తిపాస్తులపై ఆమె కూతురు కన్ను పడింది. ఆ ఆస్తి మొత్తం తనకే దక్కాలని ఆమె ఆశపడింది. అయితే, తల్లి ఆస్తిని వేరే వారికి ఇస్తుందేమోనన్న అనుమానం, ఆస్తి తన చేజారిపోతుందనే భయం ఆమెలో పెరిగిపోయింది. ఆస్తి కోసం కన్నప్రేమను కాలరాసిన ఆమె, భర్తతో కలిసి తల్లిని, అడ్డుగా ఉన్న మిగతా ముగ్గురిని వదిలించుకోవాలని దారుణమైన ప్లాన్ వేసింది.
గతంలో జరిగిన దొంగతనం వెనుక అసలు దొంగలు..
కొంతకాలం క్రితం హసీనా ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కూడా ఈ విచారణలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నగదు, నగలు కాజేసింది కూడా ఈ కూతురు, అల్లుడేనని పోలీసులు తేల్చారు. ఆస్తిని ఎలాగైనా గుంజుకోవాలనే వారి దురాశ అప్పట్లోనే దొంగతనానికి పురికొల్పింది. ఆ ఘటనపై పోలీసులు నిఘా పెట్టడంతో తాము దొరికిపోతామనే భయం, ఆస్తిపై మరింత కక్ష వారిని హత్యల వైపు నడిపించాయి. తాము నేరుగా తలదూర్చితే దొరికిపోతామని భావించిన ఈ కిరాతక దంపతులు, నలుగురిని ఒకేసారి అంతమొందించేందుకు ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం భారీ మొత్తంలో సుపారీ ఇచ్చి ప్రొఫెషనల్ కిల్లర్స్‌ను రంగంలోకి దించారు.
నిందితులు ఇచ్చిన సమాచారం, ప్లాన్ ప్రకారమే ఆ కిరాయి ముఠా హసీనాతో పాటు మరో ముగ్గురిని అత్యంత క్రూరంగా హతమార్చింది. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, హసీనా కుటుంబ సభ్యుల కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. కూతురు, అల్లుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల గుచ్చి గుచ్చి అడిగిన ప్రశ్నలకు తడబడిన దంపతులు, చివరకు ఆస్తి కోసమే తాము సుపారీ ఇచ్చి ఈ నలుగురిని హత్య చేయించినట్లు అంగీకరించారు. కన్న తల్లిని, కుటుంబ సభ్యులను పొట్టనబెట్టుకున్న కూతురు, అల్లుడితో పాటు సుపారీ తీసుకున్న కిల్లర్స్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.

