కలం, వెబ్ డెస్క్: మూడో విడత పంచాయతీ ఎన్నికలపై (Panchayat elections) అధికార కాంగ్రెస్ పార్టీ గట్టి ఫోకస్ పెట్టింది. మొదటి, రెండు విడతల్లో కాంగ్రెస్ గణనీయమైన సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నది. తొలివిడతలో మొత్తం 4230 స్థానాలకు గాను 2426, రెండో విడతలో 4332 స్థానాలకు గాను 2331 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు గెలుపొందారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) సహజంగా అధికారపార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతుంటారు. సంక్షేమ పథకాలు, స్థానిక నాయకత్వం వంటి అంశాలు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కొన్ని జిల్లాలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవడం, ఎమ్మెల్యేలు, కీలక నేతలకు చెందిన స్వగ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడం ఆ పార్టీని కలవరపెడుతున్నది.
దీంతో మూడో విడత ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. మూడో విడతలో ఎట్టి పరిస్థితుల్లోనూ గణనీయమైన స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేయాలని.. తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల మీద మరింతగా ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్ బెడద వేధిస్తోంది. రెబల్ అభ్యర్థులు భారీగా ఓట్లను చీలుస్తుండటంతో తమకు నష్టం వాటిల్లుతోందని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం.
తొలి విడత, రెండో విడత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన గ్రామాల్లో ప్రత్యర్థులు గెలుపొందారు. దీంతో మూడో విడతలో ఇటువంటి సమస్యలు రాకుండా ఆయా గ్రామాల మీద ఫోకస్ పెట్టాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెందిన గ్రామాల మీద కచ్చితంగా ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.
Follow Us On: Sharechat


