epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అధికారమే టార్గెట్‌గా కేసీఆర్ పక్కా వ్యూహం

కలం డెస్క్ : రెండేండ్లకు పైగా ఫామ్‌హౌజ్‌కు పరిమితమైన బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) మళ్ళీ జనంలోకి రావాలనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) వచ్చిన సానుకూల ఫలితాలతో పార్టీని పటిష్టంగా ఉంచాలనుకుంటున్నారు. రాబోయే మూడేండ్లలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహం పన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో (Irrigation Projects) పాటు కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చంద్రబాబునాయుడికి (Chandrababu) అనుకూలంగా ఉంటున్నాయనే అస్త్రాన్ని ప్రయోగించి తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రాజేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న రాజకీయ వాతావరణం రానున్న రోజుల్లో డిఫరెంట్‌గా మారుతుందని బీఆర్ఎస్ కేడర్ ధీమాతో ఉన్నారు.

రెండేండ్ల టైమ్ ఇచ్చాం.. ఇక విజృంభిస్తాం :

రాష్ట్రంలో ప్రభుత్వం సెటిల్ కావడానికి కొంత సమయం పడుతుందని, ఆ తర్వాత విధాన నిర్ణయాలు (Policy Decisions) తీసుకుని అమల్లోకి తేవడానికి ఇంకొంత సమయం అవసరమని స్వయంగా కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రెండేండ్లు పూర్తయ్యేవరకు అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించిన కేసీఆర్ ఇక నుంచి ప్రధాన ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలనుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్న మాట. ప్రజలకు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించరాదని, ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో పాటు సవరించుకునేలా ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచే ద్విముఖ్య వ్యూహాన్ని అనుసరించాలనుకుంటున్నది బీఆర్ఎస్. తెలంగాణ భవన్‌లో ఈ నెల 19న జరిగే విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారనే అభిప్రాయం శ్రేణుల్లో నెలకొన్నది.

ప్రజలు మనతోనే.. మనమే ప్రజల్లో లేం :

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, మాజీలు సీరియస్‌గా ప్రచారంలోకి దిగలేదని, కానీ గెలిచిన చాలా గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా బీఆర్ఎస్‌ను కోరుకుని ఓటు వేశారన్నది కేసీఆర్(KCR) భావన. ఇదే అభిప్రాయాన్ని తన సన్నిహితులతో పంచుకున్నట్లు తెలిసింది. పార్టీని పటిష్టం చేసుకుని మళ్ళీ ఎన్నికల్లో గెలవాలన్న తపన ఉన్న నేతలు మాత్రమే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవడంపై దృష్టి పెట్టారన్నది ఆయన అభిప్రాయం. ప్రజల్లో ఇప్పటికీ పార్టీ పట్ల మంచి అభిప్రాయం ఉన్నందున దీన్ని కాపాడుకోవడంతో పాటు పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. ప్రజలు పార్టీతోనే ఉన్నా పార్టీ నేతలు మాత్రం ప్రజలతో లేరనే నిశ్చితాభిప్రాయంతో ఇక నుంచి పార్టీ తరఫున యాక్టివిటీస్‌ను ముమ్మరం చేసే యాక్షన్ ప్లాన్‌ను రాబోయే సమావేశంలో వివరించే అవకాశమున్నది.

చంద్రబాబు, రేవంత్‌ కాంబినేషన్‌పై గురి :

దాదాపు పది నెలల తర్వాత విస్తృత స్థాయి సమావేశం కోసం తెలంగాణ భవన్‌కు వస్తున్న కేసీఆర్… తొలుత ఇరిగేషన్ అంశాన్ని ప్రస్తావించేలా షెడ్యూలు రెడీ చేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించే క్రమంలో చంద్రబాబునాయుడిని పరోక్షంగా ప్రస్తావించి రేవంత్‌(Revanth Reddy)ను టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. ఇందుకు ఊతమిచ్చేలా కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమైన నిర్ణయాలు జరుగుతున్నాయని వివరాలు వెల్లడించే అవకాశమున్నది. తద్వారా తెలంగాణ ప్రజల్లో మరో రూపంలో సెంటిమెంట్ రేకెత్తించాలన్నది దీని వెనక ఉద్దేశం. ప్రభుత్వానికి రెండేండ్ల టైమ్ ఇచ్చామని, దాని సత్తా ఏంటో తెలిసిపోయిందని, ఇక రాష్ట్ర ప్రయోజనాలే లక్యంుతగా శ్రేణుల్ని రోడ్డెక్కించే ప్లాన్‌ను వివరిస్తారన్నది తెలంగాణ భవన్ వర్గాల సమాచారం.

Read Also: మా పిల్లలని యూట్యూబ్ చూడనివ్వము – యూట్యూబ్ సీఈఓ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>