కలం, వెబ్ డెస్క్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో (Sarpanch Elections) భాగంగా ఆదివారం వివిధ గ్రామాల్లో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పోలింగ్ సందర్భంగా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థి అభ్యర్థి డబ్బులు పంచుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఓ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. మెదక్(Medak) జిల్లా నార్సింగి మండలంలోని పెద్ద తండాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. తన ప్రత్యర్థి అభ్యర్థి ఓటర్లను ప్రభావితం చేయడానికి ఒక్కో ఓటుకు రూ.2 వేల చొప్పున డబ్బులు పంపిణీ చేశాడని ఆయన ఆరోపించారు.
సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) అక్రమాలకు అధికార యంత్రాంగం సహకరిస్తోందని, తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేసి ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని వాపోయారు. న్యాయం చేయాలని, డబ్బులు పంపిణీ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ పైకి ఎక్కి నిరసనకు దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అభ్యర్థిని కిందికి దిగేలా ఒప్పించేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
Read Also: సమ్మిట్ సమిష్టి నిర్ణయం కాదా?
Follow Us On: Youtube


