కలం, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్‌లు సిద్ధమవుతున్నాయి. భారీ ప్యాకేజీలతో ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలకమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. కొన్ని నిబంధనలు, షరతులు విధించారు. న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు నిర్వహించే త్రీ స్టార్ హోటళ్లు, క్లబ్‌లు, బార్లు, రెస్టారెంట్లకు కొన్ని నిబంధనలు పెట్టారు. కచ్చితంగా వాటిని పాటించాలని కోరుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట మార్గదర్శకాలు విడుదల చేశారు.
పోలీసుల మార్గదర్శకాలు ఇవే..
‘టికెట్స్ విక్రయించి న్యూ ఇయర్ వేడుకలు (New Year Celebrations) నిర్వహించాలనుకున్న బార్లు, క్లబ్‌లు, రెస్టాంట్లు, పబ్‌లు కచ్చితంగా 15 రోజుల ముందే పోలీసుల నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రజల భద్రత కోసం కచ్చితంగా ప్రవేశద్వారం, ఎగ్జిట్ దగ్గర సీసీ టీవీ ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత కోసం యాజమాన్యం సరిపడా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. డాన్సులు, కామెడీ షోలలో అనుచిత ప్రవర్తన, అశ్లీలత లేకుండా చూసుకోవాలి. అశ్లీల దుస్తులు ధరించడం కూడా నిషిద్ధమే. అవుట్‌డోర్ సౌండ్ సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లౌడ్ స్పీకర్, డీజే సిస్టమ్, సౌండ్ మిక్సర్, సౌండ్ అంప్లిఫైయర్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10:00 గంటలకు ఆపాలి. కమ్యూనిటీ హాల్, కన్వెన్షన్ హాల్, ఫంక్షన్‌హాల్‌లకు మినహాయింపు ఉంటుంది. అక్కడ రాత్రి ఒంటి గంట వరకు మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. సౌండ్ మాత్రం 45 డెసిబెల్స్ మించకూడదు.’ అంటూ పోలీసులు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
బాణాసంచా నిషేధం
హాల్ సామర్థ్యానికి మించి టికెట్లను విక్రయించొద్దు. ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేసి రోడ్లను బ్లాక్ చేయడం నిషిద్ధం. కపుల్ కార్యక్రమాలు, పబ్‌లు, బార్లలోకి మైనర్స్ ప్రవేశించడానికి వీల్లేదు. డ్రగ్స్, నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్థాల వినియోగం అనుమతించకూడదు. వినియోగించినట్టు తేలితే యాజమాన్యం మీద పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. లిక్కర్ సప్లై ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయంలోనే పూర్తి చేయాలి. మత్తులో ఉన్న వినియోగదారులను సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేయడానికి డ్రైవర్లు లేదా క్యాబ్‌లను ఏర్పాటు చేయాలి. బాణాసంచా పెద్దఎత్తున కాల్చడం నిషేధం. స్టార్ హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, రెస్టారెంట్లలో ప్రధాన ప్రవేశ ద్వారంలో పోలీసులు ఇచ్చిన సూచనలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలి. ‘డ్రంక్ డ్రైవ్ నేరం. పట్టుబడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. మైనర్లు వాహనం నడిపినా పోలీసులు అదుపలుోకి తీసుకుంటారు. ద్విచక్ర వాహనాల సైలెన్సర్ తొలగించడమూ నేరమే. అతి వేగం, ప్రమాదకర డ్రైవింగ్, రేజింగ్ చేసినా.. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించినా నేరమే’ ఈ సూచనలను కచ్చితంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే బార్లు, క్లబ్‌లు నిర్వహించే సంస్థలు ఈ బోర్డులను ఏర్పాటు చేయాలి.
Read Also: సాల్ట్ లేక్ ఘటన.. సీఎం మమతా క్షమాపణలు..
Follow Us On: Instagram


