కలం డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియగానే పంచాయతీరాజ్ (Panchayatraj) మంత్రి సీతక్క(Minister Seethakka), ఆ శాఖ అధికారుల బృందం ఢిల్లీకి వెళ్ళనుంది. కేంద్రం నుంచి గ్రామీణ స్థానిక సంస్థలకు రావాల్సిన బకాయిల (Central Funds) వసూళ్ళపై దృష్టి సారించనున్నది. స్థానిక సంస్థలకు పాలకమండళ్ళు లేకపోవడంతో ఇంతకాలం నిధుల విడుదలకు లీగల్ చిక్కులు ఎదురయ్యాయి. ఈ నెల 17వ తేదీతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ ముగిసి పాలకమండళ్ళు కొలువుదీరనున్నాయి. దీంతో పెండింగ్ బకాయిలను విడుదల చేయడానికి ఆటంకాలు తొలగిపోయినట్లవుతుంది. రెండేండ్లుగా 15వ ఫైనాన్స్ కమిషన్ (Finance Commission) నుంచి రూరల్ లోకల్ బాడీస్ (Rural Local Bodies) నుంచి నిధులు రిలీజ్ కాలేదు.
గడువు ముగిసే లోపే నిధులు :
వచ్చే ఏడాది మార్చి 31తో ఆ ఫైనాన్స్ కమిషన్ పదవీకాలం ముగుస్తుండడంతో వీలైనంత తొందరగా ఫండ్స్ తెప్పించుకోవడంపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ఇంకా జరగని కారణంగా 15% మినహా మిగిలిన నిధులన్నీ విడుదల చేయడానికి కేంద్రానికి ఎలాంటి ఆటంకాలు లేవు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క(Minister Seethakka), పంచాయతీరాజ్ అధికారులు వచ్చే వారం ఢిల్లీ వెళ్ళి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి పెండింగ్ బకాయిల విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించి ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఒకేసారి రెండు సంవత్సరాల బకాయిలను రిలీజ్ చేయాల్సిందిగా అడిగే అవకాశమున్నది. దాదాపు రూ. 2,800 కోట్లు రావచ్చని అధికారుల అంచనా.
అభివృద్ధి పనులకు లైన్ క్లియర్ :
ఇంతకాలం గ్రామాలకు సర్పంచ్‌లు, వార్డులకు ఎన్నికైన సభ్యులు లేని కారణంగా ఆఫీసర్ల పాలన కొనసాగింది. ప్రజా ప్రతినిధులు లేని కారణంగా గ్రామాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఎన్నికైనందున వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీ, డంపింగ్.. ఇలా అన్ని సమస్యల పరిష్కారం తక్షణ కర్తవ్యంగా మారనున్నది. ఇందుకు అవసరమయ్యే నిధులను కేంద్రం నుంచి తెప్పించుకుంటే డెవలప్‌మెంట్ వర్క్స్ కు ఇబ్బంది ఉండదు. కొత్త ఫైనాన్స్ కమిషన్ ఉనికిలోకి రాకముందే నిధులను తెప్పించుకోగలిగితే ప్రజా ప్రతినిధులపై స్థానికుల నుంచి ఒత్తిడి తగ్గుతుందనేది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం. ఒకవైపు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగానే లెక్క ప్రకారం కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాపై రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు లెక్క తేల్చారు. అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ మీటింగ్ నిర్వహించి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళేందుకు షెడ్యూలు తయారవుతూ ఉన్నది.
Read Also: ఇలాగైతే కష్టమే… ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ వార్నింగ్
Follow Us On: X(Twitter)


